తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి ఈ మధ్య తరచూ అనుమానాస్పద విమాన రాకపోకలు జరుగుతున్నాయి. ఇటీవల అవి విమానాల రాకపోకలు కొన్ని రోజులుగా పెరిగిపోయాయి. శనివారం ఉదయం ఓ విమానం ఆలయ సమీపంలోనుంచే వెళ్లింది. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంపై ఎటువంటి విమానాలు ఎగురకూడదనే నియమం ఉంది. గతంలో అలాంటి ఘటనలు జరిగినా భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ అందుకు తగిన విధంగా స్పందిస్తుండేది.
ప్రస్తుతం ఇంచుమించుగా రోజూ విమానాలు కనిపిస్తున్నా టీటీడీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని.. కనీసం అవి ప్రయాణికులు వెళ్లే విమానాలా? లేక ఇతర విమానాలా అన్న విషయం కూడా పట్టించుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ‘తిరుమలపై విమానాల రాకపోకలను నిషేధించాలని కేంద్ర హోం శాఖకు, పౌర విమానయానశాఖకు గతంలోనే తెలియజేశాం. దేశభద్రత కోణంలో కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. వారి పరిధిలో ఉన్న ఈ అంశంపై మేము మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం. మరోసారి ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఛైర్మన్, ఈవోలకు నివేదిస్తాం’ అని టీటీడీ సీవీఎస్‌వో నరసింహ కిశోర్ తెలిపారు.