ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా మాజీ ఎంపీ నందిగం సురేష్ ను ఇవాళ మంగళగిరి పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయం పై జరిగిన దాడి కేసులో రెండు రోజుల పాటు ఆయనను కస్టడీకి ఇచ్చింది కోర్టు. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో విచారణకు సహకరించాలని తెలిపింది. ఈ దాడి వెనుక ఎవరున్నారనే దానిపై విచారణలో తేల్చనున్నారు పోలీసులు. ఇవాళ మధ్యాహ్నం 12గంటల నుంచి ఎల్లుండి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలీస్ కస్టడీలోనే ఉండనున్నారు.
ఈ విచారణ సందర్భంగా ఎలాంటి లాఠీ చార్జీ చేయడం, దూషించడం, భయపెట్టడం వంటివి చేయవద్దని కోర్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ సందర్భంగా తమ న్యాయవాదులను కూడా విచారణకు అనుమతించాలని నందిగం సురేష్ తరపు న్యాయవాది వాదనలను న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. దీనికి సంబంధించి ప్రత్యేక పిటిషన్ దాఖలు చేస్తే.. దానిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది మంగళగిరి కోర్టు. ఇదిలా ఉంటే.. నందిగం సురేష్ ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీ కొట్టిన ఘటనలో తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.