అధికార పార్టీ ఎమ్మెల్యే అంటే.. ఎలా ఉండాలి! ఎంత జోష్ ఉండాలి! ఛాతీ విరుచుకుని, జబ్బలు చరు చుకుని ముందుకు సాగుతారనే పేరుంది. ఒక్క ఫోన్ కాల్‌తో పనులు చేయించే స్థాయిలో ఉంటారని కూడా అందరూ అనుకుంటారు. కానీ, ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి అలా లేదు! వారు ఫోన్ చేసినా పట్టించుకునే నాధుడు కూడా లేరు. ఇప్పుడు ఇదే వారి పాలిట తీవ్ర తలనొప్పిగా మారిపోయింది. ఇదే చెప్పుకొ ని వారు తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ ఎందుకు వైసీపీ ఎమ్మెల్యేలు ఇంతగా బాధపడుతున్నారు? అనే ప్రశ్నకు సమాధానం ఇదే.
జగన్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. దేశంలో ఏరాష్ట్రంలోనూ లేని విధంగా లక్షల సంఖ్యలో వలంటీర్లను నియమించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసం ధానంగా వీరిని వినియోగించాలని జగన్ భావించారు. ప్రభుత్వం చేసే పనులు, చేపట్టే కార్యక్రమాలు, అమలు చేసే సంక్షేమం వంటివి ప్రజలకు నేరుగా అందించాలని జగన్ తలపోశారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా చేయాలని ప్రభుత్వాన్ని ఎన్నుకొన్నందుకు వారికి ప్రభుత్వమే ఇంటి ముందుకు వెళ్లి సేవలు చేయాలనే గొప్పలక్ష్యంతో ఈ వ్యవస్థను జగన్ పాదుకొల్పారు.
ఈ క్రమంలోనే వలంటీర్లను నియమించారు. గ్రామ/ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. వలంటీర్ల నియామకంలో ఎమ్మెల్యేలే కీలక పాత్ర పోషించారు. వారు చెప్పిన వారికే వలంటీర్లుగా పోస్టులు దక్కాయి. దీంతో అంతా మావోళ్లే కదా! అనుకున్నారు ఎమ్మెల్యేలు. ఇంకేముంది.. మేం ఏం చెప్పినా జరిగిపోతుంది.. అంతా మా ఇష్టమే అనుకున్నారు. కానీ, ఏకుల్లా వచ్చిన వలంటీర్లు.. ఇప్పుడు ప్రభుత్వ కనుసన్నల్లో మేకుల్లా మారిపోయారు. ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా నేరుగా ప్రజలతోనే కాంటాక్టు పెట్టుకున్నారు. ప్రజలకు ఏమి అవసరమో.. వారే నేరుగా తెలుసుకుంటున్నారు.
వలంటీర్ల ఫోన్లకే ప్రజలు కూడా ఫోన్లు చేస్తున్నారు. వారి సమస్యలు చెబుతున్నారు. ఏదైనా ఉంటే వారితోనే మాట్లాడుతున్నారు. దీంతో రాష్ట్రంలో ఎమ్మెల్యేలు డమ్మీలుగా మారిపోయారు. నిజానికి జగన్ ఇలాంటి పరిస్థితి కోరుకోక పోయినా.. అనూహ్యంగామాత్రం ఇదే జరుగుతోంది. మరి ఇలా అయితే.. కష్టమే అంటున్నారు పరిశీలకులు కూడా. ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో అసంతృప్తులు పెరుగుతున్నాయి. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.