నో కామెంట్..ఇప్పుడు ఆంధ్రాను కూడా హిజాబ్ వివాదం తాకింది.విజయవాడ లయొలా కాలేజీలో ఇద్దరు విద్యార్థినులను అక్కడి ప్రిన్సిపల్ తరగతులకు హాజరుకానివ్వలేదు.దీంతో అక్కడ చాలా పెద్ద రగడే నెలకొంది.ముస్లిం మత పెద్దలు, రాజకీయ నాయకులు (వైసీపీ మినహా ఇతర పార్టీల నాయకులు) అక్కడికి చేరుకుని ఆందోళన చేయడంతో ఆఖరికి సిటీ కమిషనర్ జోక్యం చేసుకున్నారు. కలెక్టర్ కూడా ప్రిన్సిపల్ తో మాట్లాడి వివాదాన్ని చక్కదిద్దారు.ఓ సామరస్యపూర్వక ముగింపు ఇచ్చారు.అయితే ఆ ఇద్దరి విద్యార్థినుల ఐడీ కార్డులూ ఇష్యూ అయి రెండేళ్లు అయి మూడో ఏడాది నడుస్తోంది.
వాళ్లు బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. అంటే ఇప్పటిదాకా ఆ ప్రిన్సిపల్ ఏమయినా కళ్లు మూసుకున్నాడా? లేదా వివాదం చేస్తే కొత్తగా వార్తల్లో నిలిస్తే ఏమయినా క్రేజ్ వస్తుందని అనుకుంటున్నాడా? ఎప్పటి నుంచో తమ సంప్రదాయం అనుసరించి తరగతులకు వస్తున్న ఆ విద్యార్థినులను అడ్డుకోవడం,ఆ తరువాత అవమానించడం ఇవన్నీఎటువైపు దారి తీస్తాయో కనీసం ఆలోచిస్తున్నారా? ఇవీ విద్యార్థినుల తరఫు నుంచి ముస్లిం పెద్దలు మరియు ప్రజా స్వామ్య వాదులు అడుగుతున్న ప్రశ్నలు. ప్రశాంత తీరంలో కల్లోలిత వాతావరణం ఎందుకు సృష్టిస్తున్నారో తమకు అర్థం కావడం లేదు అని పాపం ఆ విద్యార్థినులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.మూడేళ్ల చదువులో ఇది ఆఖరు అంకం.తమను ఇలా వేధిస్తారని కలలో కూడా అనుకోలేదని అంటున్నారు వీళ్లు.ఇప్పటికైనా సున్నతమయిన ఈ విషయాన్ని మరింత సున్నితం అయిన పసి హృదయాలను అర్థం చేసుకుని ప్రవర్తించాలని ప్రజా హక్కుల సంఘాలు విద్యా సంస్థల అధిపతులను వేడుకుంటున్నాయి.