విశాఖ వీధుల్లో కేసీఆర్ హల్చల్ చేశారు.పుట్టిన్రోజు వేళ తన నవ్వులను అందరికీ పంచారు. ఏంటి నిజంగా అనుకుంటున్నారా? కాదండి.. విశాఖ కేంద్రంగా నిన్నటి వేళ తెలంగాణ చంద్రుడు కేసీఆర్ పుట్టిన్రోజు సందర్భంగా బ్యానర్లు, హోర్డింగ్లు వెలిశాయి. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు సందడి చేశారు. ఇవన్నీబాగానే ఉన్నా కేసీఆర్ ఆంధ్రా రాజకీయాల్లోకి అడుగుపెడతారా? ఒకవేళవస్తే ఆయన సాధించేదేంటి? అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కేసీఆర్ కనుక ఆంధ్రా రాజకీయాల్లోకి ముఖ్యంగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లోకి ఆయన వస్తే మంచి మార్పులే వస్తాయి. ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్న టీడీపీ,వైసీపీ అసంతృప్తులు అంతా కేసీఆర్ గూటికి చేరిపోతారు.అదేవిధంగా తమ సత్తా చాటేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఓట్లను చీల్చడం ఖాయం. ఆ విధంగా కేసీఆర్ అభ్యర్థులు గెలిచినా గెలవకున్నా ఇతరుల విజయావకాశాలను బలీయంగా ప్రభావితం చేయడం ఖాయం.
ఇక శ్రీకాకుళం లాంటి,విజయనగరం లాంటి మారుమూల ప్రాంతాలకు కేసీఆర్ వస్తే ముఖ్యంగా ఆయన మన్యం సమస్యలపై ఫోకస్ చేయాలి.ఆ రోజు ఆయన కృష్ణా జలాల వినియోగంపై ఎలా మాట్లాడారో అలానే గోదావరి జలాల వినియోగం ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పోలవరం నీళ్లు.. ఇచ్ఛాపురం వరకూ వచ్చేందుకు మార్గం సుగమం చేయగలగాలి. అదేవిధంగా ఉద్దానం కిడ్నీ సమస్యలపై ఆయన మాట్లాడాలి.అంతేకాదు ఆయనకు మంచి అభిమానులు ఉన్నారు.వారందరినీ కలుపుకునికొత్త రాజకీయం ఆరంభించేందుకు కేసీఆర్ సన్నద్ధం కావాల్సిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఎలానూ నిలువరించేందుకు చేస్తున్న ఉద్యమానికి హరీశ్ రావు,కేసీఆర్ మద్దతు ఇస్తున్నారు కనుక ఆ ప్రాంతంలో గులాబీ బాస్ క్రేజ్ పెరగడం ఖాయం.ఇక విజయనగరం జిల్లాలో బొత్సతో కలిసి పనిచేస్తే మంచి ఫలితాలే వస్తాయి. ఇక కేసీఆర్ ఆంధ్రా రాజకీయాల్లోకి వస్తే చాలా మంది రాజకీయ నిరుద్యోగులకు, ఔత్సాహికులకు మంచి వేదిక దొరకనుందని భావించాలి.