ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఎన్డీయే కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై వైఎస్ షర్మిల నిలదీశారు. అయితే రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ కచ్చితంగా అమలవుతుందని, అయితే ఏ జిల్లా మహిళలు ఆ జిల్లాలోనే ఉచితంగా ప్రయాణించేందుకు అర్హులు అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం పై వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. “ఏరు దాటేంత వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్నలా” కూటమి ప్రభుత్వ తీరు ఉందని ఆమె ఫైర్ అయ్యారు.
ఈ క్రమంలో మహిళలకు ఉచిత బస్సు పథకం విషయంలో కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని వైఎస్ షర్మిల విమర్శించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో జర్నీ ఫ్రీ అంటూ ఊదరగొట్టి, ఓట్లు వేయించుకొని ఇప్పుడు జిల్లా స్థాయి వరకే పథకాన్ని పరిమితం చేస్తామని చెప్పడం దారుణం అని వైఎస్ షర్మిల ఆరోపించారు. పథకం అమల్లోకి వచ్చేసరికి నియోజకవర్గం, మండల స్థాయి వరకే ఫ్రీ అంటారేమో అని ఎద్దేవా చేశారు. ఇదేనా కూటమి ప్రభుత్వం కల్పించే మహిళా సాధికారత? అని ఆమె ప్రశ్నించారు.