ఒకేసారి జగన్, కేసీఆర్ పెగాసెస్ సాప్ట్ వేర్ కొనుగోలు : బోండా ఉమా

-

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేకంగా అధికారులను నియమించి ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసేందుకు మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ఒకేసారి పెగాసెస్ సాఫ్ట్వేరు కొన్నారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సీఎం జగన్ టీడీపీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. మమ్మల్ని ఫాలో అవుతోన్న కొంతమందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని చెప్పారు.

వారి ఫోన్లలో టీడీపీ నేత కేశినేని చిన్ని వివరాలు దొరికాయన్నారు. మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నట్లు లైవ్ లో ఆధారాలు లభ్యం అయ్యాయని అన్నారు. వైసీపీ ఫోన్ ట్యాపింగ్ పై  ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వారిపై ఈసీ చర్యలు తీసుకోవాలని ఉమ కోరారు.  ఓ వైపు ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తుండగా.. మాజీ సీఎం కేసీఆర్ ఫోన్లు ట్యాప్ చేసేందుకు పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేశారని టీడీపీ నేత బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు సెన్సేషన్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news