సంకల్పయాత్రలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎన్నో సమస్యలు తెలియజేసుకున్నారు అర్చకులు. అవన్నీ ఆలకించిన జగన్… “నేను విన్నాను – నేను ఉన్నాను” అని భరోసా ఇచ్చారు. “కుర్చీ ఎక్కకముందు ఒకమాట కుర్చీ ఎక్కాక ఒకమాట తాను మాట్లాడనని” మరోసారి నిరూపించుకునే ప్రయత్నం చేసిన జగన్… అర్చకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వంశపారంపర్య హక్కులను పునరుద్ధరిస్తూ జీవో జారీ చేశారు. త్వరలోనే ఈ జీవో అమలుకానుంది. దీంతో.. సూర్యోపస్థానంలోని”పశ్యేమ శరదశ్శతం, జీవేమ శరదశ్శతం, నందామ శరదశ్శతం, మోదామ శరదశ్శతం” అని జగన్ ను ఆశీర్వదిస్తున్నారు అర్చకులు! దీనర్థం… “నిండు నూరేళ్లు ఆ సూర్యుని చూడగలగాలి.. నిండు నూరేళ్ళు ఆనందంగా జీవించాలి” అని!!
అవును… ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న అర్చకుల కల ఒక్క జీవోతో నెరవేర్చారు జగన్. ఇదే విషయాన్ని చెబుతూ అర్చకులు, అర్చక సంఘం నేతలూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో వంశపారంపర్య అర్చకత్వం కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూసిన అర్చకులకు… నేడు,రేపు అంటూ ఐదేళ్ల పాటు కాలయాపన చేసి చివరకు మొండి చెయ్యి చూపించింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ సమస్యతోపాటు మరెన్నో సమస్యల సాధన కోసం అర్చక సంఘాలు గత ప్రభుత్వ హయాంలో ఉద్యమాలు కూడా చేశాయి. అయినా నాటి ప్రభుత్వం వీరిని పట్టించుకున్న పాపాన పోలేదు.
దీంతో సంకల్పయాత్రలో భాగంగా విశాఖలో నిర్వహించిన బ్రాహ్మణ గర్జనలో జగన్, అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చే క్రమంలో… వంశపారంపర్య హక్కులను పునరుద్ధరిస్తూ జీవో జారీ చేశారు. ఇదే క్రమంలో ప్రతి ఆలయంలో పనిచేసే అర్చకులకు కనీస వేతనం ఇచ్చేందుకు జగన్ నిర్ణయించారు. 6బి, 6సి దేవాలయాల్లో పనిచేసే ప్రతి అర్చకుడికి రూ. పదివేలు జీతం ఇవ్వాలని దేవదాయ అధికారులను జగన్ ఆదేశించారు. దీంతో అర్చకలోకం ఆనంద మంత్రం జపిస్తుంది!