తెలంగాణ సీఎంగా కేసీఆర్ 6 సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌పై ఆయన నిప్పులు చెరిగారు. సోమవారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కేవలం తన సామాజిక వర్గానికే న్యాయం చేశారని అన్నారు. 14 ఏళ్లుగా ఉద్యమం చేసి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలకు న్యాయం జరగడం లేదన్నారు. కేవలం తన కుటుంబ సభ్యులు, తన సామాజిక వర్గానికే మేలు జరిగే విధంగా కేసీఆర్ వ్యవహరించారన్నారు.
తమకు ఎలాంటి భేషజాలు లేవని చెప్పుకునే కేసీఆర్ రాష్ట్రంలో జరిగే పూజా కార్యక్రమాలకు ఆంధ్ర నుంచి బ్రాహ్మణులను ఎందుకు తీసుకువస్తున్నారని రేవంత్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు, యాదగిరి గుట్టకు తెలంగాణ బ్రాహ్మణులను ఎందుకు తీసుకురాలేదని అడిగారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మందిని కేసీఆర్ పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. తెలంగాణ సమాజాన్ని మోసం చేసిన మోసగాడు కేసీఆర్ అని అన్నారు. ప్రజలకు సామాజిక న్యాయం అందిస్తామని, స్వేచ్ఛగా పాలన చేస్తామని, నీళ్లు, నిధులు, నియామకాల కోసమని చెప్పి ప్రజలను నమ్మించి కేసీఆర్ సీఎం అయ్యారని.. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ లేదని, ప్రజలు అన్ని విధాలుగా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
రాష్ట్రంలో హక్కుల కోసం మాట్లాడేవారిని కేసీఆర్ అణచివేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. కేటీఆర్, హరీష్ రావు, వినోద్ రావు, కవిత, సంతోష్ రావు.. ఇలా రావులకు మాత్రమే కేసీఆర్ సామాజిక న్యాయం చేశారని, కేవలం తన కుటుంబీకులు, తన సామాజిక వర్గానికి చెందిన వారే కేసీఆర్ హయాంలో బాగుపడ్డారని అన్నారు. గత 20 ఏళ్ల కిందట పలు ప్రభుత్వ శాఖల్లో పనిచేసి రిటైర్ అయిన తన సామాజిక వర్గానికి చెందిన వారిని తీసుకొచ్చి మళ్లీ ఇప్పుడు వారిని కీలక పదవుల్లో కేసీఆర్ నియమిస్తున్నారని తెలిపారు. అలా ఇప్పటి వరకు ఎంతో మందిని ఆయన నియమించారని, మరో రెండు మూడు రోజుల్లో ఆ లిస్ట్‌ను తాను బయట పెడతానని అన్నారు.
ఎంతో మంది ఔత్సాహికులకు పోస్టులు ఇవ్వకుండా, పోస్టుల్లో ఉన్నవారికి ప్రమోషన్లు కల్పించకుండా.. రిటైర్ అయిన తన బంధువులను తీసుకువచ్చి.. వారికి పలు ప్రభుత్వ శాఖల్లో కీలక పదవులను కేసీఆర్ అప్పగిస్తున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇందుకోసమేనా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని రేవంత్ మండిపడ్డారు. సంకనాకనీకి తెలంగాణ తెచ్చుకున్నామా..? అని రేవంత్.. కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు.
రాజీవ్‌గాంధీ అప్పట్లో ఆర్టికల్ 73, 74లకు సవరణలు చేసి స్థానిక సంస్థలకు విశేష పరిపాలన అధికారాలు వచ్చే విధంగా, పంచాయతీలు, మున్సిపాలిటీలు తమను తామే స్వేచ్ఛగా పరిపాలించుకునే విధంగా అవకాశం కల్పిస్తే.. ప్రస్తుతం ఆ వ్యవస్థలను కేసీఆర్ నీరుగార్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. స్థానిక సంస్థల ప్రతినిధులు, జిల్లా పరిషత్, మున్సిపల్ ప్రజా ప్రతినిధులు, మేయర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కేసీఆర్ కింద బానిసలుగా బతకాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. కేసీఆర్ అక్రమాలను తాము నిలదీస్తామన్నారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం కేవలం కేసీఆర్ కుటుంబానికే కాదని.. తెలంగాణ సమాజానికి కూడా దక్కాలని.. అందుకు తాను పోరాటం చేస్తానని.. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ ఒంట్లో చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు కేసీఆర్‌పై పోరాటం చేస్తారని.. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.