వైసీపీలో ఆ ఇద్ద‌రి ఫైటింగ్‌తో జ‌గ‌న్‌కు కొత్త త‌ల‌నొప్పి…!

ఏపీలో అధికార వైసిపిలో నేతల మధ్య యుద్ధాలు రోజురోజుకు ముదురుతున్నాయి. గన్నవరం, విశాఖపట్నం, చీరాల, రాజోలు నియోజకవర్గంలో ఇప్పటికే పాత కొత్త నేతల మధ్య కూల్ వాటర్ పోసిన పెట్రోల్ మాదిరిగా మండుతోంది. ఇక పార్టీలో చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు సీనియర్ నేతలకు – ఎంపీలకు ఎమ్మెల్యేలకు – మంత్రులకు ఎంపీలకు – మంత్రులకు ఎమ్మెల్యేలకు ఏ మాత్రం పొస‌గ‌టం లేదు. పార్టీకి కంచుకోటగా ఉన్న కర్నూలు జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో వైసీపీలో గ్రూపుల గోల రోజురోజుకు ఎక్కువవుతోంది. ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆళ్లగడ్డ, కర్నూలు, కోడుమూరు, నందికొట్కూరు నియోజకవర్గాల్లో పార్టీ రెండు గ్రూపులుగా చీలిపోయింది.

ముఖ్యంగా రెండు నియోజకవర్గాల విషయంలో జగన్ వేసిన ప్లాన్ ఫెయిల్ అయినట్లే కనిపిస్తోంది. రెండు నియోజకవర్గాల్లో జగన్ ఎమ్మెల్యేలు ఉండగా నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలను మాత్రం వేరే నేతలకు అప్పగించడంతో అక్కడ ఇన్చార్జిలు, ఎమ్మెల్యేల మధ్య ఏ మాత్రం ప‌డ‌డం లేదు. నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్ నియోజకవర్గ ఇన్చార్జి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మధ్య గొడవ ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఈ గొడవ పై ఇప్పటికే ఎన్ని పంచాయితీలు జరిగినా ఎవరు వెనక్కు తగ్గడం లేదు. ఇక ఇప్పుడు మరో ఎస్సీ నియోజకవర్గం అయిన కోడుమూరులో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

ఎమ్మెల్యే సుధాకర్ వ‌ర్సెస్‌ నియోజకవర్గ ఇన్చార్జి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కి మంచి పట్టు ఉన్న ఈ నియోజకవర్గంలో కోట్ల హర్షవర్థన్ రెడ్డి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరి ఎమ్మెల్యే సుధాకర్ గెలుపు కోసం బాగా కష్ట పడ్డారు. అయితే ఇప్పుడు కోట్ల హర్షవర్థన్ రెడ్డికి ఉన్న క్రేజ్ ముందు సుధాకర్ నిలబడలేక పోతున్నారన్న చర్చలు వినిపిస్తున్నాయి. ప్రతి కార్యక్రమానికి కోట్లకే పిలుపు ఉంటుందని.. సుధాకర్‌ను ఎవరు పట్టించుకోవడం లేదన్న టాక్ వినిపిస్తోంది.

సుధాకర్ నియోజకవర్గంలో పూర్తి డమ్మీ అయిపోయారని.. అధికారులు, పార్టీ నేతలు ఆయనను అసలు పట్టించుకోవడం లేదని చర్చలు నడుస్తున్నాయి. ఇతర పార్టీల నుంచి వైసీపీలో చేరుతున్న వారు కూడా కోట్ల సమక్షంలోనే కండువాలు మార్చుకుంటున్నారు. అటు అధికారులు కూడా ఆయన మాట వినడంతో సుధాకర్ ఇప్పుడు నియోజకవర్గంలో ఒంటరి పోరాటం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కోడుమూరు రాజకీయంతో జగన్‌కు కొత్త తలనొప్పి ఏర్పడిందని చెప్పాలి.

-vuyyuru subhash