రాష్ట్రంలో వరదలు ప్రజలపై తీవ్ర ప్రతాపాన్ని చూపాయి. కానీ వరద సహాయక కార్యక్రమాలను చంద్రబాబు సక్రమంగా చేయలేకపోయారు. దీన్ని చూస్తే ఆయనకేమైనా మతిభ్రమించిందేమో అనే అనుమానం కలుగుతుంది అని అన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వరద సహాయక చర్యల్లో కొందరు ఐఏఎస్ ఐపీఎస్ లు సరిగా వ్యవహరించలేకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు.. తన తప్పు లేదనేందుకు ఎదుటివారి మీద వేసేందుకు.. ఎవరెవరితోనో మొదట మాట్లాడిస్తారు. అనంతరం ఎల్లో మీడియా దీన్ని ప్రచారం చేస్తుంది. తర్వాత చంద్రబాబు దీనిని ధ్రువీకరిస్తారు అని పేర్కొన్నారు.
అలాగే కొందరు ఐఏఎస్.. ఐ.పి.ఎస్. అధికారులు వైసీపీతో అంట కాగారని.. వారి వల్లే వరద సహాయక చర్యలు సరిగా చేయలేకపోయామని చెప్పడం విడ్డూరం. ఐఏఎస్ ..ఐపీఎస్ అధికారులు ప్రభుత్వంలో పనిచేస్తారు. ప్రభుత్వాలు మారుతాయే తప్ప అధికారులు మారరు. అధికారులకు వాహనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. అధికారులను నియంత్రించలేక.. దిశా నిర్దేశం చేయలేకపోతున్నారు. చంద్రబాబు క్యాబినెట్ ఒక చెత్త క్యాబినెట్.. చంద్రబాబు చుట్టూ చెత్త టీం ఉంది. చెత్త అంతా చేరి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.