ఇటీవల అంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. అధికార పదవుల్లో వున్న వారు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న తీరు విచారకరమన్న ఆయన వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రత్యేక హోదాపై ఏం పురోగతి సాధించారు…!? అని ప్రశ్నించారు. ఢిల్లీ కి వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు? అని ఆయన ప్రశ్నించారు. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వేగవంతమైన క్రిమినల్ కేసుల విచారణ పై వారు బెంబేలెత్తుతున్నారని అందుకే ప్రధాని, హోం మంత్రితో జరిగిన సమావేశాల వివరాలు కూడా వెల్లడించడం లేదని అన్నారు.
వ్యక్తిగత అజెండానే రాష్ట్ర అజెండాగా సమావేశాలు జరుపుతున్నారన్న అయన మీ ప్రవర్తనపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. 28 మంది ఎంపీలున్న పార్టీ ప్రత్యేక హోదాపై ప్రయత్నించకుండా, ప్రతిపక్షాలపై కేసులు వేయించే అంశాన్ని అజెండాగా పెట్టుకున్నారని అన్నారు. మంత్రుల భాషపై సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటోందని ఆయన అన్నారు. సజ్జల రామకృష్ణా రెడ్డి రాజ్యంగేతర శక్తిగా వ్యవహరిస్తూ మంత్రులను జీరో చేస్తున్నారని అన్నారు. కేంద్ర మంత్రివర్గంలో చేరేందుకు వైసీపీ తహతహ లాడుతొంటే అవినీతిలో కూరుకుపోయిన మీరు మాకొద్దని బీజేపీ అంటోందని ఆయన అన్నారు.