ఏపీలో ఆ ఐపీఎస్ కి కీలక పోస్టింగ్.. అప్పుడు వ‌ద్దు.. ఇప్పుడు ముద్దు

-

టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఆ ఐపీఎస్ దే కీరోల్. ఒకానొక దశలో టీడీపీ నేతలకంటే ఆ పోలీస్ బాసే వైసీపీ నేతల పై దూకుడుగా వెళ్లాడు. సీన్ మారింది వైసీపీ అధికారంలొకొచ్చింది ఆ అధికారి లూప్‌లైన్‌లోకి వెళ్లారు. కానీ సంవత్సరం తిరిగే సరికి వైసీపీ సర్కార్ లోనే ప్రాధాన్యత గల పోస్టు దక్కించుకున్నాడు. ఇప్పుడిదే అంశం అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కీలక పోస్ట్‌ ఎలా పట్టేశాడన్నదాని పై ఆసక్తికర చర్చ నడుస్తుంది.

సాధారణంగా ఉన్నతస్థాయి అధికారుల్లో చాలామంది ఎవరు అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా వ్యవహరిస్తారు. ఎన్నికల సమయంలో డీజీపీగా ఉన్న ఠాకూర్‌.. తమను అణగదొక్కేందుకు ప్రయత్నించారని వైసీపీ ఆరోపించింది. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు రావడం.. అధికారం చేపట్టడంతో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. అధికారుల బదిలీలలో ఫస్ట్‌ స్ట్రోక్‌ పోలీస్‌ బాస్‌పైనే పడింది. డీజీపీగా ఉన్న ఠాకూర్‌ ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ విభాగం కమిషనర్‌గా బదిలీ అయ్యారు.

విశాఖ విమానాశ్రయంలో కోడి కత్తి ఘటన సందర్భంగా ఠాకూర్‌ వ్యవహరించిన తీరు నాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి రుచించలేదు. ఆ ఘటనపై విచారణ జరగకముందే దాడికి పాల్పడింది వైసీపీ కార్యకర్తగా ప్రకటించారు ఠాకూర్‌. అప్పట్లో చంద్రబాబు ఏం చెబితే అదే డీజీపీ హోదాలో ఠాకూర్‌ చెబుతున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. ఇక వైసీపీ సర్కార్ రావడంతో రిటైరయ్యే వరకు ఆయన మెయిన్‌ లైన్‌లోకి వచ్చే అవకాశమే ఉండదని పోలీస్‌ వర్గాలు భావించాయి. అలాంటిది ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఠాకూర్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్‌.

ఈ అనూహ్య బదిలీ పై అధికార, రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరగుతోంది. గత ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన సాయిప్రసాద్‌, సతీష్‌చంద్ర వంటి అధికారులు కూడా తిరిగి కీలక బాధ్యతలు చూస్తున్నారు. ఇప్పుడు ఠాకూర్‌ వంతు వచ్చిందని అనే వారు కూడా ఉన్నారు. ఠాకూర్‌ మరో మూడు నాలుగు నెలల్లో రిటైర్‌ అవుతున్నారు. పదవీ విరమణ చేసే సమయంలో కీలక పోస్టుల్లో ఉండాలని అధికారులు కోరుకుంటారు. అందుకే సంధికి ప్రయత్నించారట.

వైసీపీ మీద కానీ వ్యక్తిగతంగా ఎలాంటి విరోధభావం లేదని వైసీపీ పెద్దలను కలిసి వివరణ ఇచ్చారట. ఇటు ప్రభుత్వం కూడా అధికారుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తారనే ఆరోపణలు వాస్తవం కాదని చెప్పే ప్రయత్నం చేసిందని టాక్‌. అయితే ఠాకూర్‌ మళ్లీ లైమ్‌ లైట్‌లోకి రావడానికి నార్త్‌ ఇండియా లాబీ పనిచేసిందనే ప్రచారం కూడా ఉంది. ఏది ఏమైనా.. డిజీపీగా పనిచేసిన అధికారి ఒక్కసారిగా తెరమరుగై.. ఇప్పుడు కీలక పోస్టులోకి రావడం చర్చగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news