విజయవాడలో కరెంట్ కోతలు పెడుతున్నామన్నారు మంత్రి గొట్టిపాటి రవి. భారీ వర్షాల వల్ల జరిగిన విద్యుత్ శాఖ నష్టంపై అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ… వీటీపీఎస్ లోకి భారీగా వర్షపు నీరు చేరటం వల్ల 2500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందన్నారు. నీటిని తోడే పనులు నిర్విరామంగా సాగుతున్నాయని చెప్పారు. పోలవరం సైట్ నుంచి హై కెపాసిటీతో నీరు తోడే పంపులు తెప్పిస్తున్నామని వివరించారు.
బొగ్గు మొత్తం తడిచిపోవటం వల్ల విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరించేందుకు మరో 48 నుంచి 72 గంటల సమయం పడుతుందని… విజయవాడ పరిసరాల్లో విద్యుత్ అంతరాయంపై అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు. విజయవాడ నగరంలోనూ పలు చోట్ల విద్యుత్ కోతలు ఉన్నమాట వాస్తవమేనని… ఎక్కడా ప్రాణనష్టం జరగకూడదనే కొన్ని చోట్ల ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేసామని వెల్లడించారు. అధికారులు, సిబ్బంది అంతా క్షేత్రస్థాయిలోనే ఉంది ఫిర్యాదులు పరిష్కరిస్తున్నారు….స్థానిక ప్రజాప్రతినిధులతోనూ మాట్లాడి వారి సూచనలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు వేగవంతం చేశామన్నారు.