ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తీవ్రంగా కొనసాగుతోంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసులతో ప్రజలు హడలిపోతున్నారు. సామాన్య ప్రజలతో పాటు ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వైద్యులు, పోలీసులు, ప్రజా ప్రతినిధులు సైతం కరోనా బారినపడుతున్నారు. ఈ మహమ్మారి సోకి ఇప్పటికే అనేకమంది మరణించగా మరికొందరు కోలకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా ఈ మహమ్మారి బారిన కృష్ణా జిల్లా నందిగామ వైసీపీ ఎమ్మెల్యే డా. మొండితోక జగన్‌మోహన్‌రావు పడ్డారు.
రెండు మూడు రోజుల నుంచి కొన్ని లక్షణాలు కనిపించడంతో జగన్ మోహన్ రావు కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు చెబుతున్నారు. దీంతో గత నాలుగు రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్న వారంతా జగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. హోం క్వారంటైన్ లో ఉండటంతో పాటు కరోనా పరీక్షలు చేయించు కోవాలని జగన్ మోహన్‌రావు సూచించారు. ఇక తాజాగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 6,232 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 6,31,749కు చేరుకున్నాయి.