నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తాజా వ్యాఖ్యలను పరిశీలిస్తే.. ఆయనలో ఇంకా పార్టీలో తనకేదో ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆశ ఉన్నట్టుగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. అంతేకాదు, ఇంకా తానుపార్టీలోనే ఉన్నానని అనుకోవడాన్ని కూడా వారు ఎద్దేవా చేస్తున్నారు. నిజానికి ఈ విషయంలో వైఎస్సార్ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి.. ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశారు. రఘురామ రాజుని.. మా పార్టీలో దూరం పెట్టాం. ఆయన సభ్యుడే అయినప్పటికీ.. అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌కు కూడా పత్రం ఇచ్చామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ పరిణామాలు గమనించిన తర్వాత.. ఓ విషయం క్లారిటీ వచ్చింది.
అందరూ కూడా రఘు సాంకేతికంగా పార్టీలో ఉన్నాడే తప్ప.. నైతికంగా ఆయనను జగన్ ఎప్పుడో బుట్టదాఖలు చేశారని నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో రఘుకు క్లారిటీ లేదని కాదు.. కానీ, ఆయన ఆడుతున్న దొంగ పోలీస్ ఆట.. రసకందాయానికి చేరుకున్నట్టే చేరుకుని యూ టర్న్ తీసుకోవడమే. వాస్తవానికి ఆయన వైఎస్సార్ సీపీలోనే ఉన్నానని అంటున్నారు. కానీ, వ్యూహాత్మకంగా ఎదురుదాడి చేస్తున్నారు. ఇదే పార్టీలో తీవ్ర విమర్శలకుదారితీసింది. పైగా ఈ పరిణామం విపక్షాలకు జగన్‌పై మరిన్ని అస్త్రాలను అందించినట్టయిందనేది వాస్తవం. నేను పార్టీలోనే ఉన్నాను.. ఉంటాను.. అంటూనే సొంత పార్టీ చూరుకే నిప్పు పెట్టేలా వ్యవహరించడం మాత్రం మానుకోలేదు.
తాజాగా వైఎస్సార్ సీపీ నాయకుడు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఎంపీ రఘుకు గట్టి షాక్ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ నేతలతో ఆయన మీటింగ్ పెట్టారు. దీనికి అందరినీ పిలిచారు. ఒక్క రఘురామను తప్ప. ఈ మీటింగ్‌లోనే జిల్లా కరోనా పరిస్థితి సహా నిధుల విషయం, అభివృద్ధిపైనా చర్చజరిగినట్టు తెలిసింది. ఈ క్రమంలో.. కీలకమైన నరసాపురం ఎంపీని పిలవకపోవడం రాజకీయంగా చర్చకు అవకాశం ఇచ్చింది. అయితే, దాదాపు ఏడెనిమిది నెలలుగా పార్టీని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్న రఘురామను ఎలా పిలుస్తారని ఎవరైనా అనుకుంటారు?
ఇదే పరిస్థితి వచ్చిన బీజేపీలో ఉమాభారతి ఆరేళ్లపాటు సస్పెండ్ చేయలేదా? అంతెందుకు అయోధ్య విషయంలో తీవ్ర విమర్శలు చేసిన సాధ్వి ని పక్కకు నెట్టలేదా? ఈ విషయాలు తెలిసి కూడా ఇంకా పట్టుకుని వేలాడుతున్న రఘుకు మరో మార్గం లేదని, మరే పార్టీ కూడా ఇలాంటి నిత్య అసమ్మతి వాదిని చేర్చుకునేందుకు ఇష్టపడదనే విషయం స్పష్టం కావడం లేదా?! ఇంకా పట్టుకుని వేలాడడం ఎందుకు రాజు గారూ అనే గొంతుకలు తెరమీదికి వస్తున్నాయి. నిజానికి నరసాపురం నుంచి గెలిచిన రాజులు చాలా పౌరషవంతులుగా పేరు పడ్డారు. కానీ, రాజుగారు.. ఏకంగా తనపై అనర్హత వేటు వేయాలనే కఠిన నిర్ణయం తీసుకున్న పార్టీలో ఎందుకు కొనసాగడం? ఆ పాటి పౌరుషం లేదా? అనే ప్రశ్నలు కూడా తెరమీదికి వస్తున్నాయి.