ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై వైస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణతో పాటే ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో శాసనసభ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ఉన్నారని తెలిపారు. అందువల్ల ఈ డిసెంబరులో శాసనసభ ఎన్నికలు ఖాయమని జోస్యం చెప్పారు.
‘’ఏపీలో ప్రతిపక్షాలు ఐక్యం కాకముందే ఎన్నికలకు వెళ్లాలన్నది ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి యోచనగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఓట్లున్న ప్రతిపక్షాలు కలవడం ఖాయం. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కూడా వారితో కలిసే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయానికి కారణమైన కోడి కత్తి కేసుతో పాటు మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు మా పార్టీ పెద్దలు ఆడించిన నాటకమేనని తేలితే రానున్న ఎన్నికల్లో మా పార్టీ పరిస్థితి ఏమిటనేది అంతు చిక్కడం లేదు. ఇప్పటికే కోడి కత్తి కేసు నాటకమని ఎన్‌ఐఏ తేల్చింది. వివేకా హత్య కేసు దాదాపు కొలిక్కి వచ్చింది. ఈ నెలాఖరులోగా ఛార్జిషీట్ దాఖలు చేసి కేసులో అనుమానితులను అరెస్టు చేస్తామని సీబీఐ హైకోర్టుకు తేల్చి చెప్పింది’…’ అని రఘురామ అన్నారు.