ఆర్.ఆర్.ఆర్. కొత్త రచ్చ: మంత్రి, సేనాపతి, బట్రాజు…!!

ఆంధ్రప్రదేశ్ లో నేతల మధ్య రసవత్తర రాజకీయం నడుస్తోంది. పార్టీలు, నాయకులు చిత్రవిచిత్రంగా వారి వారి వాదనలను వినిపిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మూడు రాజధానుల అంశంపై ప్రజల నుంచి రెఫరండం కోరాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా తమ గళాన్ని ఝలిపించారు.

ఏపీలో తాజాగా గవర్నర్ తీసుకున్న మూడు రాజధానుల‌ బిల్లు ఆమోదంపై మాట్లాడిన ఆర్.ఆర్.ఆర్… “రెఫ‌రెండం” కోరాల‌ని డిమాండ్ చేశారు! అమరావతి రైతులతో పాటు, రాష్ట్ర ప్రజల‌ను కూడా రెఫ‌రెండం కోరాల‌ని ప్రభుత్వాన్ని సూచించిన ఆయన… “రైతులారా, ప్రజలారా ఆందోళన పడకండి.. న్యాయ మార్గాల ద్వారా, గాంధేయమార్గఒ ద్వారా మీ నిరసనను తెలియజేయండి” అంటూ పిలుపునిస్తున్నారు. ఇదే క్రమంలో… కొత్త ముఖ్యమంత్రి వచ్చిన ప్రతిసారి రాజధానిని మార్చాలనుకోవడం అవివేకమైన చ‌ర్య‌గా వ్యాఖ్యానించిన ఆర్.ఆర్.ఆర్… రాజధాని అని పిలిచినంత మాత్రాన ఆ ప్రాంతం అభివృద్ధి చెంద‌ద‌ని స్పష్టం చేశారు.

అదేవిధంగా ఒక సామాజిక వర్గం బలపడుతుందేమోనని రాజధానిని విశాఖ తరలించడం సరైన చర్య కాద‌ని మొదలెట్టిన ట్రిపుల్ ఆర్… విభజన చట్టం, సెక్షన్- 6 ప్రకారం నియమించబడిన శివరామ కృష్ణన్ కమిటీని కాదని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయాన్ని అమలు పరచడం త‌గ‌ద‌ని కూడా వాపోయారు. అంతేకాకుండా ప్రజలతో చర్చించకుండా ఏకపక్షంగా మూడు రాజధానుల నిర్ణయం ఎలా తీసుకుంటారు అంటూ ప్ర‌శ్నాస్త్రాన్ని సంధించారు ర‌ఘురామ‌కృష్ణంరాజు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ఓ ఉన్నతాధికారి ప్రతి సందర్భంలో ప్రభావితం చేస్తున్నార‌ని.. విమ‌ర్శించిన ఆయన.. మంత్రి, సేనాపతి, బట్రాజు వంటి అన్ని పాత్రలు ఆ అధికారే పోషిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా సుప్రీంకోర్టు నిర్ణయంతో ఏర్పడిన హైకోర్టు.. కేవలం గవర్నర్ ఆమోదించినంత మాత్రాన కర్నూలుకు తరలడం అసాధ్య‌మ‌ని తెలిపారు. అంతటితో ఆగకుండా దక్షిణాఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయని తప్పుదోవపట్టిస్తున్నార‌ని.. నాలుగు దేశాల కలయిక వల్ల చారిత్రక కారణాలతో అక్కడ మూడు రాజధానులు ఏర్పడ్డాయ‌ని గుర్తు చేస్తున్నారు. రాజ్యాంగ నిబంధనలు లేదా సుప్రీంకోర్టు నిర్ణయాలవల్ల కర్నూలు న్యాయ రాజధాని ఆగిపోతే ఆ ప్రాంత ప్రజలు మరోసారి భంగపడతార‌ని వివరించారు. ఇక‌.. దేశవ్యాప్తంగా కరోనా నియంత్రణపై ప్రభుత్వాలు దృష్టి సారిస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం రాజధాని మార్పుపై దృష్టి సారిస్తోంద‌ని మండిపడ్డారు.

మొత్తానికి రఘురాముడి ఆవేదన దేనికి సంకేతం అంటూ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు! మొదటి నుంచీ ప్రభుత్వ విధానాలను అత్యంత పారదర్శకంగా సమర్థించడంలో విఫలం అవుతున్నారని టాక్ నడుస్తోన్న వేల… ప్రభుత్వానికి – ప్రజలకు వారథిగా ఉండాల్సిన ఇలాంటి నేతలు, ప్రజలకు వాస్తవాలు చెప్పడంలో విఫలమవుతున్నారనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి!!