రూపాయకే ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించి లబ్ధిదారులకు అందజేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పినప్పటికీ, ఆయనకు అవగాహన లేకుండా చెప్పి ఉంటారని సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటారేమోనని రఘురామకృష్ణ రాజు గారు అపహాస్యం చేశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల వ్యవధిలో ఉద్యోగులకు సీపీయస్ రద్దు చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పగా, అవగాహన లేకుండా జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పారని గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు పేర్కొన్న విషయం తెలిసిందేనని, పరదలా చాటున, ప్రజలకు దూరంగా ఉండే ముఖ్యమంత్రి గారిని ప్రజలతో సంబంధం లేని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఎవరూ ప్రశ్నించకపోయినప్పటికీ, పార్టీ సభ్యులుగా తమని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు.
ముఖ్యమంత్రి గారిని ఎవరూ ప్రశ్నించలేరని, ఒకవేళ ప్రశ్నిస్తే డీజీపీ హోదా కలిగిన పోలీసు అధికారి సునీల్ కుమార్ వారిని చిత్రహింసలకు గురి చేస్తారని అన్నారు. మాట తప్పితే కాలర్ పట్టుకుని నిలదీయమని గతంలో ముఖ్యమంత్రి గారే సలహా ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజలు ఎక్కడ కాలర్ పట్టుకుని నిలదీస్తారేమోనని కాబోలు… పరదాల చాటున ముఖ్యమంత్రి గారు ప్రజలకు దూరంగా ఉంటున్నట్లుగా ఉందని అన్నారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదు?, రూపాయకే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారా??, బ్యాంకు బాకీలను ప్రభుత్వమే చెల్లిస్తుందా???, జగన్ మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే తప్పడని నిరూపించండి అంటూ రఘురామకృష్ణ రాజు గారు సూచించారు. ప్రజలకు ఆస్తి హక్కు కల్పిస్తామని చెప్పి గతంలో ఒక్కొక్క కుటుంబం నుంచి పదివేల రూపాయలు వసూలు చేశారని, ఆస్తి హక్కు కలిపిస్తూ ప్రభుత్వం ఇచ్చిన పత్రం నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావడం లేదని, ఆస్తి హక్కు పత్రంపై ఏ ఒక్కరికి కూడా అప్పు పుట్టలేదని, పదివేల రూపాయలిచ్చి మోసపోయామని ప్రజలు ఇప్పటికే గ్రహించారని రఘురామకృష్ణ రాజు గారు పేర్కొన్నారు.