తారకరత్నని పరామర్శించిన ఎంపీ విజయసాయిరెడ్డి

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో గుండెపోటుకి గురై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను పరామర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ సందర్భంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి తారకరత్న ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.

45 నిమిషాల పాటు గుండె ఆగిపోవడం వల్ల మెదడులోని పైభాగం దెబ్బతిన్నదని, దానివల్ల మెదడులో నీరు చేరి మెదడు వాచిందన్నారు. వాపు తగ్గిన వెంటనే బ్రెయిన్ రికవరీ అవుతుందని డాక్టర్లు తెలిపినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. నందమూరి బాలకృష్ణ దగ్గర ఉండి తారకరత్నకు అన్ని వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారని విజయసాయిరెడ్డి ప్రశంసించారు. బాలకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు విజయసాయిరెడ్డి. తారకరత్న త్వరలోనే కోలుకుంటారని, డాక్టర్లు మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారని తెలిపారు.