తమ్ముళ్లకు షాక్: రాష్ట్రపతిని కలిసిన ఎంపీలు అసలు విషయం మరిచారు!!

-

అధికారంలోకి వచ్చినప్పటినుంచీ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అరాచకపాలన చేస్తోందని తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణలో జోక్యం చేసుకోవాలని కోరారు. అంతవరకూ బాగానే ఉంది కానీ.. అసలు విషయం మరిచారు మా ఎంపీలు అంటూ తెగ ఫీలయిపోతున్నారంట టీడీపీ కార్యకర్తలు!

జగన్ పాలన బాగాలేదని, అరాచకాలు చేస్తున్నారని, అవినీతికి పాల్పడుతున్నారని, రాజ్యాంగ వ్యవస్థలను సైతం లెక్కచేయడం లేదని… అన్నీ చెప్పారు సంతోషమే.. అది వారి బాధ్యత కూడా.. అని టీడీపీ నేతలు అంటుంటే… “జగన్ సృష్టిలో లోపం లేదు – టీడీపీ నేతల దృష్టిలోనే లోపం ఉంది” అని వైకాపా నేతలు అంటున్నారు! ఆ సంగతులు కాసేపు పక్కనపెడితే… ఎంపీల ఫిర్యాదుల్లో ఒక విషయం మరిచిపోయారని టీడీపీ కార్యకర్తలు ఫీలయిపోతున్న ఆ విషయం ఏమిటంటే… ప్రత్యేక హోదా!

అవును… ఇప్పటికే అన్ని రకాలుగా మునిగిపోయిన పార్టీకి, ప్రజల్లో కాస్తో కూస్తో అభిమానం కలగాలంటే ఇలాంటి ఆలోచనలు చేయకుండా ఎలా ఉన్నారు మా ఎంపీలు అని ఫీలయిపోతున్నారంట తమ్ముళ్లు! ప్రభుత్వంపై ఎన్ని ఫిర్యాదులు చేసినా అది మీకూ మీకూ ఉన్న రాజకీయ సమస్యగానే ప్రజలు చూస్తారు తప్ప.. అక్కడివరకూ వెళ్లిన వారు రాష్ట్రాభివృద్ది కోసం, ప్రజలు ఎంతో ఆశగా చూస్తున్న హోదా కోసం ఒక్కమాటైనా ఎందుకు మాట్లాడలేదు.. అలా మాట్లాడి ఉంటే.. జనంలో ఎంతో కొంతగా మన పార్టీమీద పాజిటివ్ కోణం వచ్చేది కదా అనేది వారి బాద!

“హోదాని కాదని ప్యాకేజీ ఒప్పుకున్న పాపం మనదే కాబట్టి.. ఆ పాపాని కడిగేసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే కదా” అనేది తమ్ముళ్ల లాజిక్! ఇంతోటి ఆలోచన మా ఎంపీలకు లేదే అనేది వారి ఆవేదన!

Read more RELATED
Recommended to you

Latest news