జనవరి 27 నుంచి నారా లోకేశ్ పాదయాత్ర

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తన పాదయాత్రపై అధికారిక ప్రకటన చేశారు. జనవరి 27 నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర.. 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్లు కొనసాగుతుందని తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు లోకేశ్‌ నడవనున్నారు. మంగళగిరి నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

మంగళగిరి నియోజకవర్గంలో 4 రోజులు పాదయాత్ర ఉంటుందని.. మిగిలిన రోజుల్లో రాష్ట్రమంతా పాదయాత్ర చేయనున్నట్లు లోకేశ్‌ వెల్లడించారు. తనని ఓడించేందుకు సీఎం జగన్‌ వాడే అన్ని ఆయుధాలను దీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. మంగళగిరిని కాపు కాసే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలని పార్టీ నేతలకు లోకేశ్‌ సూచించారు.