నరసాపురం పిలుస్తోంది రఘురామ ? 

-

రెబల్ అంటే ఎంత రెబల్ గా ఉంటాడో, ప్రత్యక్షంగా చూపిస్తున్నారు నరసాపురం వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. అదే పనిగా వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ, ప్రతిపక్షాలు కూడా విమర్శ చేసేందుకు వెనకడుగు వేసే అంశాలపైనా రాజుగారు వెనక్కి తగ్గకుండా విమర్శలు అధికార పార్టీ పై ఎక్కు పెడుతూనే ఉన్నారు. ముఖ్యంగా వైసీపీలో కొంతమంది నాయకుల తీరుపైన అధినేత జగన్ పైన, అసంతృప్తితో ఉన్న ఆయన అదేపనిగా ప్రభుత్వం లోని లోపాలను ఎత్తి చూపిస్తూ, ఢిల్లీ నుంచి మీడియా సమావేశాలు నిర్వహిస్తూ హడావుడి చేస్తూనే ఉన్నారు. అసలు ఆయన బీజేపీలోకి వెళ్లేందుకు ఇంత హడావుడి చేస్తున్నారని, ముందు అందరూ అనుకున్నా, బిజెపి సైతం ఆయనను దూరం పెట్టినట్టు కనిపిస్తోంది.
ఒక వైపు బిజెపి అండదండలు లేకపోయినా, సొంత పార్టీపై విమర్శలు చేస్తుండ డంతో చాలామంది సన్నిహితులు దూరమయ్యారు. ఇక ఆయనతో సన్నిహితంగా ఉండేందుకు మిగతా పార్టీల నాయకులు ఎవరూ, పెద్దగా సాహసించడం లేదు. ఇవన్నీ రాజు గారికి బాగా తెలిసినా, తన దూకుడును తగ్గించుకునేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు. ఇదిలా ఉంటే ఆయన తెలిసిన దగ్గర నుంచి ఎక్కువగా ఢిల్లీకే పరిమితమైపోవడం, వైసిపి తో విభేదాలు వచ్చిన దగ్గర నుంచి ఆయన నియోజకవర్గంలో అడుగుపెట్టేందుకు పెద్దగా ఆసక్తి చూపించకపోవడం, ఏపీలో తాను అడుగుపెట్టినా, నియోజకవర్గంలో పర్యటించినా, తనకు వైసీపీ నాయకుల నుంచి ప్రాణహాని ఉందంటూ, ఆయన ప్రకటించడం, ఇలా ఎన్నో అంశాలు చోటుచేసుకున్నాయి.
కొద్ది నెలల క్రితమే ఆయనకు బిజెపి ప్రభుత్వం కేంద్ర బలగాలతో సెక్యూరిటీ కూడా కల్పించింది. అయినా ఆయన నర్సాపురం నియోజకవర్గంలో అడుగు పెట్టేందుకు ఆసక్తి చూపించడం లేదు. అయితే ఎంపీగా ఆయనను గెలిపించినా, ప్రజలు మాత్రం, నియోజకవర్గంలో ఆయన అందుబాటులో లేకుండా ఢిల్లీలో ఉంటే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. జగన్ ప్రభుత్వం పై రాజుగారికి ఎప్పుడు ఆగ్రహం తగ్గుతోందో..  ఇంకెప్పుడు తనకు ఓట్లు వేసిన నరసాపురం ప్రజలకు అందుబాటులోకి వస్తారో … వారి రుణం ఎప్పుడు తీర్చుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news