ఆయన సీనియర్ నాయకుడు. రాష్ట్ర స్థాయిలో దశాబ్దం కిందటే ఆయన పేరు మార్మొగింది. కాంగ్రెస్లో ఉండగా, రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పారు. ఆ పార్టీని రాష్ట్రంలో ముందుండి నడిపించారు. అలాంటి నా యకుడు ఇప్పుడు వైసీపీలోనూ రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పుతున్నారు. అయితే, ఏడాది కాలంలో ఆయ నకు మిగిలింది ఏమిటి? ఈ ఏడాదిలో ఆయన పార్టీ పరంగాను, మంత్రిగాను సాధించిన రికార్డులు ఉన్నా యా? అంటే.. పెద వి విరవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆయనే సీనియర్ మోస్ట్ నాయకుడు విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి విజయం సాధించిన వైసీపీ నేత, జగన్ ప్రభుత్వంలో తొలి ఐదు స్థానాల్లో ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ.
మంత్రిగా బొత్స వ్యవహరించడం ఆయనకు కొత్తకాదు. ఈ రాష్ట్రానికి కూడా కొత్తకాదు. ఉమ్మడి ఏపీలోనే ఆయన వైఎస్ జమానాలోనే మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆయనకుమారుడు జగన్ వద్ద కూడా మంత్రిగా చక్రం తిప్పుతున్నారు. అయితే, ఆయన పరిస్తితి ఈ ఏడాది కాలంలో ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీల మోత అన్నట్టుగా ఉందని అంటున్నారు పరిశీలకులు. చీపురుపల్లిలో విజయం సాధించినా.. జిల్లాపై మాత్రం పట్టు సాధించలేక పోతున్నారు. జిల్లాలో సీనియర్ నాయకుడు.. జగన్కు ఆత్మీయుడు కోలగట్ల వీరభద్రస్వామి ముందు డింకీలు కొడుతున్నారు బొత్స. కోలగట్ల వ్యూహాల ముందు బొత్స దూకుడు ఏమాత్రం పనిచేయడం లేదనే టాక్ ఉంది.
ఇక, మంత్రిగా చూస్తే.. పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున మంచి వాయిస్ వినిపిస్తున్నారు. రాజధాని విషయంలో మూడుంటే తప్పేంటని, చంద్రబాబు ఆయన పరివారం రాజధానిని కేకులా పంచేసుకున్నారని వ్యాఖ్యలు చేసి రాష్ట్రంలో సంచలనం సృష్టించారు. అదేసమయంలో ప్రధాన మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే వార్తలను కౌంటర్ చేయడంలోనూ మంత్రి బొత్స దూకుడుగానే ఉంటున్నారు. ఇక, తనకు కేటాయించిన పట్టణాభివృద్ధి శాఖ విషయంలోనూ దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇలా ప్రభుత్వంలో ఆయన దూకుడు ప్రదర్శిస్తున్నా.. నియోజకవర్గంలోను, విజయనగరం జిల్లాలోనూ మాత్రం ఆయన వెనుకంజలో ఉన్నారనేదివాస్తవం. ఇటీవల ఆయన మేనల్లుడిపై గనులకు సంబంధించిన ఆరోపణలు వచ్చాయి. దీనిపై జగన్ వివరణ కోరినట్టు కూడా సమాచారం. అయినా.. బొత్స చేతులకు మట్టి అంటలేదని అంటున్నారు. ఇలా ఏడాది కాలంలో ఫిఫ్టీ-ఫిఫ్టీ విజయం అందుకున్నారనే చెప్పాలి!