రాష్ట్రంలో సీఎం జగన్‌పై జరుగుతున్న వ్యతిరేక ప్రచారంలో కొత్త కోణం వెలుగు చూసింది. ఆయనపై ఇప్పటికే ఉన్న క్రిస్టియానిటీ ముద్రను మరింత పెంచేలా ఈ ప్రచారం సాగుతుండడం గమనార్హం. గతంలోనే ఎన్నికల సమయంలో జగన్ క్రిస్టియన్ అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు టీడీపీ నాయకులు. ఇక, జగన్ మాతృమూర్తి విజయమ్మ కూడా ఎన్నికల ప్రచారంలో బైబిల్ పట్టుకునే ప్రచారం నిర్వహించడం వంటివి కూడా ఈ వాదనను ఎవరూ కొట్టేయలేని పరిస్థితిని కల్పించింది. అయినప్పటికీ.. ప్రజలు గత ఏడాది ఎన్నికల్లో జగన్‌కు అఖండ మెజారిటీ ఇచ్చి.. అధికారం అప్పగించారు.
ఇంత వరకు బాగానే ఉంది. మరి తర్వాత… జగన్ అన్ని మతాల వారినీ కలుపుకొని పోలేదా? కేవలం క్రిస్టియన్‌గానే ఆయన ముద్ర వేసుకున్నారా? అంటే.. లేదనే సమాధానమే వస్తుంది. టీటీడీ బోర్డు నిర్ణయాల విషయంలోకానీ, విజయవాడ కనకదుర్గ దేవస్థానం దసరా ఉత్సవాల విషయంలో కానీ, ఆయా ఆలయ బోర్డుల నిర్ణయాన్ని ఎప్పుడూ.. జగన్ తిరస్కరించలేదు. వేలు కూడా పెట్టలేదు. పైగా మిరాశీవ్యవస్థను చంద్రబాబు రద్దు చేస్తే.. జగన్ దానిని పునరుద్ధరించారు.
ఇక, పురోహితులకు పింఛన్‌ను అమలు చేశారు. కనీసం వేతనం ఇవ్వాలన్న ఫైలును కూడా సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇక, పదవుల విషయంలోనూ డిప్యూటీ స్పీకర్ పదవిని బ్రాహ్మణ సామాజిక వర్గానికే కేటాయించారు. ఇక, బ్రాహ్మణ కార్పొరేషన్‌కు కూడా జవసత్వాలు ఇచ్చేలా నిధులు కేటాయించారు. మరి ఇన్ని చేస్తున్నా.. జగన్‌పై ఎందుకు క్రిస్టియన్ అనే ముద్ర పడుతోంది ? తాజాగా వైసీపీ ఎంపీ, అసమ్మతి నాయకుడు రఘురామకృష్ణ రాజు కూడా జగన్‌పై క్రిస్టియన్ అనే ముద్ర వేసేందుకు ప్రయత్నించారు.
జగన్‌కు హిందూ దేవుళ్లపై విశ్వాసం ఉంటే.. ఆయన సతీసమేతంగా శ్రీవారి బ్రహ్మోత్స వాల్లో పాల్గొనాలని డిమాండ్ చేశారు. అయితే, ఈ వ్యాఖ్యల వెనుక.. ఖచ్చితంగా బీజేపీ వ్యూహం ఉందనేది విశ్లేషకుల అంచనా. అనేక రూపాల్లో ప్రయత్నిస్తున్నా.. బీజేపీ ఎదుగుదలలో ఎలాంటి మార్పూ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే మరో అస్త్రంగా బీజేపీ ఈ విషయాన్ని లేవనెత్తుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఈ వ్యాఖ్యలను వైసీపీ నేతలు ఎలా తిప్పి కొడతారో చూడాలి.