వైసీపీ ప్రభుత్వానికి మృత్యుగంటికలు మోగుతున్నాయని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడుకు రాష్ట్ర నలుమూలల నుంచి ఆ పార్టీ శ్రేణులు హాజరు కాకుండా తమ పార్టీ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులను సృష్టించిందని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు.
అయినా స్వచ్ఛందంగా లక్షలాది మంది కార్యకర్తలు మహానాడుకు తరలి రావడం చూస్తే తమ పార్టీ ప్రభుత్వానికి మృత్యుగంటలు మోగుతున్నాయని స్పష్టమవుతోందని అన్నారు. సభా ప్రాంగణంలో గాలి తుఫాను వచ్చినప్పటికీ, కార్యకర్తలు బెదరలేదని, అక్కడ నుంచి వారు అడుగు కూడా ముందుకు కదలలేదని, ఎక్కడ కూర్చున్న వారు అక్కడే కూర్చుండి పోయారని పేర్కొన్నారు.
దీన్నిబట్టే తమ పార్టీ ప్రభుత్వంపై ప్రజాగ్రహము ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోందని అన్నారు. ఈ ప్రభుత్వం నుండి ఊరట కోసం జనం ఎదురు చూస్తూ ఉన్నారని, ఎప్పుడు ఈ తలకాయ నొప్పి వదిలిపోతుందా అని నిరీక్షిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి గారి సభలకు బలవంతంగా తీసుకువచ్చిన ప్రజలు కంద కాలు తవ్వినా, గేట్లకు తాళాలు వేసిన గోడలు దూకి పారిపోవడం చూశామని, తెలుగుదేశం పార్టీ మహానాడుకు హాజరైన వారు ఏ ఒక్కరు కూడా పారిపోలేదని, అసాంతం శ్రద్ధగా సభ ముగిసే వరకు కూర్చున్న చోటే ఉండిపోయారని, అది తెలుగుదేశం పార్టీపై వారికున్న అభిమానం కాబోలు అని అన్నారు.