అభివృద్ధికి కేరాఫ్ గా పేరు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు గారని ఎంపీ రఘురామ అన్నారు. అభివృద్ధితో ఏదైనా సాధ్యమే… నిరుద్యోగ భృతి ఇవ్వవచ్చు…మినీ మేనిఫెస్టో ప్రకటనతో మహిళల ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీకే… అప్పుడే తాడేపల్లిలో వణుకు మొదలైందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టో ప్రకటన అనంతరం తమ పార్టీ నాయకత్వం కొంత మంది క్యారెక్టర్ ఆర్టిస్టులను రంగంలోకి దింపి, విమర్శలు గుప్పించడం హాస్యాస్పదంగా ఉందని, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల అమలు సాధ్యం కాదని తమ పార్టీ తరఫున మాట్లాడిన కొందరు వ్యక్తులు పేర్కొనడం విడ్డూరంగా ఉందని వెల్లడించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందిని జగనన్న చదివిస్తారని ముఖ్యమంత్రి గారి సతీమణి భారతీ రెడ్డి గారు చెప్పారని, కానీ ఆ హామీ అమలుకు నోచుకోలేదని అన్నారు. జగనన్న తన సొంత డబ్బులతో పేదింటి పిల్లలను చదివిస్తున్నట్టుగా ఆమె భావించారని, తమ పార్టీ ప్రభుత్వం ఏదైతే చెప్పి మోసం చేసిందో, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తుందని చంద్రబాబు నాయుడు గారు పేర్కొనడం స్వాగతించాల్సిందేనని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఎగదొబ్బింది, చంద్రబాబు నాయుడు గారు అమలు చేసి చూపిస్తామని అంటున్నారని, కానీ ఆయన చేయలేరని తమ పార్టీ నాయకులు పేర్కొనడం విస్మయాన్ని కలిగిస్తోందని అన్నారు.