ఫిబ్రవరి రెండో వారాంతంలోగా తన లోక్ సభ సభ్యత్వానికి, వైకాపాకు రాజీనామా చేయనున్నట్లు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో పాల్గొన్న అనంతరం మంచి రోజు చూసుకుని తన ఎంపీ పదవికి, వైకాపాకు రాజీనామా చేస్తానని చెప్పారు.వైకాపాకు ఎప్పుడు నేను రాజీనామా చేస్తానని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, అయితే గతంలోనే తాను ఎంపీ పదవికి, వైకాపాకు రాజీనామా చేసి, మళ్లీ పోటీ చేయాలని భావించానని, కానీ కొంత మంది దమ్ముంటే రాజీనామా చేయాలని రెచ్చగొడుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులను పెట్టారని అన్నారు.
తనను ఎంపీగా అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ 2020లో జూన్ మాసంలో వైకాపా పార్లమెంటరీ పార్టీ పిటిషన్ ఫైల్ చేసిందని, తాను కూడా ఈ విషయాన్ని చాలెంజింగ్ గా తీసుకున్నానని తెలిపారు. అయినా ఒక దశలో తనను అనర్హుడిగా ప్రకటించడం వీరి చేతకాదని భావించి రాజీనామా చేయాలనుకున్నానని, కానీ ఇప్పుడే స్టార్ట్ అయింది… అప్పుడే పారిపోతున్నాడనే కామెంట్లను చేశారని, అప్పట్లో వైకాపా పార్లమెంటరీ పార్టీ నాయకత్వం గట్టిగానే ప్రయత్నించి ఒక మీటింగును కూడా ఏర్పాటు చేయించారని, ఆ మీటింగ్ కు నన్ను పిలిచి వివరణ కూడా కోరారని, అప్పుడు సంపూర్ణంగా తాను వివరణ ఇచ్చానని తెలిపారు.