వివేకా కేసులో జగన్, భారతి రెడ్డిపై అనుమానం – రఘురామకృష్ణ రాజు

-

వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ముఖ్యమంత్రి గారిపై ఆయన సతీమణి భారతి రెడ్డి గారిపై సీబీఐకి అనుమానము వచ్చిన మాట నిజమేనని, అందుకే వారి వ్యక్తిగత సహాయకులను పిలిచి విచారించారని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన విషయం కడప ఎంపీ వై.యస్. అవినాష్ రెడ్డి గారికి తెల్లవారుజామున 6.25 నిమిషాలకు అధికారికంగా తెలిసినప్పటికీ అంతకు ముందే అంటే సుమారు మూడున్నర గంటల సమయంలో భారతి రెడ్డి ఫోను దగ్గర పెట్టుకునే ఆమె వ్యక్తిగత సహాయకుడు చక్రాయపాలెం నవీన్ కు అవినాష్ రెడ్డి ఎందుకు ఫోన్ చేశారని ప్రశ్నించారు.

దీనితో ఈ హత్యలో భారతి రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి గార్ల పాత్ర ఉందా అన్న అనుమానం రావడం సహజమని, అనుమాన నివృత్తి కోసం సీబీఐ అధికారులు జగన్ మోహన్ రెడ్డి గారి ఓ ఎస్ డి, భారతి రెడ్డి గారి వ్యక్తిగత సహాయకుడిని విచారణకు పిలిచారని అన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు కంగారుపడుతూ అవినాష్ రెడ్డి గారికి క్లీన్ చీట్ ఇవ్వడం ఈ అనుమానానికి మరింత బలాన్ని చేకూర్చినట్లయిందని అన్నారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారికి వచ్చిన అనుమానం అర్థం లేనిది కాదని, ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నించే అర్హత వారికి ఉందని, వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు హత్య చేయించారని, జగన్ మోహన్ రెడ్డి గారిపై కోడి కత్తి దాడి చేయించింది కూడా చంద్రబాబు నాయుడు గారేనని తమ పార్టీ చేసిన ప్రచారాన్ని ప్రజలు విశ్వసించారు కాబట్టే, జగన్ మోహన్ రెడ్డి గారికి ఎన్నికల్లో పట్టాభిషేకం చేశారని అన్నారు. వివేకానంద రెడ్డి గారి హత్య వెనుక కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని, కోడి కత్తి దాడి ఒక డ్రామా అని విచారణలో తేలిపోవడంతో ఇప్పుడు ఏమి చేయాలో పాలు పోని పరిస్థితిల్లో తమ పార్టీ నాయకత్వం ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news