ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొట్టిన ఘటన దేశంలో ఎంతటి విషాదాన్ని నింపిందో తెలిసిందే. ఆ ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వేయి మంది వరకు క్షతగాత్రులయ్యారు. ఈ ఘటన తర్వాత మధ్యప్రదేశ్, తమిళనాడు, ఏపీలో మరికొన్ని ఘటనలు చోటుచేసుకున్నాయి. కానీ వాటిలో ప్రాణ నష్టం సంభవించలేదు. ఇక తాజాగా ఏపీలో త్రుటిలో ఓ రైలు ప్రమాదం తప్పింది.
బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టా విరిగిపోయింది. కీ మ్యాన్ గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం బెంగళూరు వెళ్తున్న సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్.. ఈపూరుపాలెం సమీపానికి వచ్చేసరికి అక్కడ పట్టా విరగడాన్ని కీమ్యాన్ గుర్తించారు. వెంటనే సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. దీంతో అధికారులు రైలును నిలిపేశారు. అనంతరం సిబ్బంది మరమ్మతులు చేపట్టి యథావిధిగా రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. దీంతో సుమారు అరగంట సేపు పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. వివిధ స్టేషన్లలో ఐదు రైళ్లను నిలిపేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. ఇటీవల అదే రైలు పట్టా విరగడంతో మరమ్మతులు చేసినట్లు తెలిసింది.