జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడ్డంగా దొరికిపోయారా ? సొంత పార్టీ నాయకుడు.. రాష్ట్రంలో జనసేనకు ఏకైక ఎమ్మెల్యేగా మిగిలిన రాపాక వరప్రసాద్.. పవన్‌కు గాలితీసేశారు. ఏకంగా జనసేన పార్టీని గాలి పార్టీగా అభివర్ణించిన రాపాక.. అంతటితో ఊరుకోలేదు. అసలు ఈ పార్టీ ఉంటుందో.. ఊడుతుందో కూడా తెలియదని చెప్పుకొచ్చారు. మరోమాట కూడా అనేశారు. పవన్ కేవలం కాపుల ఓటు బ్యాంకుపై మాత్రమే ఆధారపడ్డారని, మిగిలిన కులాలా ఓట్లు పవన్‌కు పడలేదని అన్నారు. దీంతోనే పార్టీ తుడిచి పెట్టుకుపోయిందని చెప్పారు. ఈ క్రమంలోనే అసలు పార్టీ ఉంటుందో ఊడుతుందోనని చెప్పడం ఆసక్తిగా మారింది.
వాస్తవానికి పాతికేళ్లు టార్గెట్ పెట్టుకున్నానని పవన్ చెబుతున్నారు. అంతేకాదు, తనకు పదవులపై కూడా వ్యామోహం లేదని అంటున్నారు. అయితే, పూటకోమాట మార్చడం వల్ల పవన్ చులకనయ్యారు. కానిస్టేబుల్ కొడుక్కి సీఎం అయ్యే అర్హతలేదా ? అని ప్రశ్నించారు. జగన్ మాత్రమే సీఎం అవ్వాలా ? అన్నారు. అంతేకాదు, చంద్రబాబుకు మళ్లీ అధికారం ఇస్తే.. ఆయన తన సుపుత్రుడిని సీఎం చేసుకుంటారని అన్నారు. పోనీ.. సీఎంగా నాకు ఛాన్స్ ఇవ్వండి అన్న మాటలపై ఆయన నిలబడి ఉంటే.. పరిస్థితి ఎలా ఉండేదో.. కానీ, అలా కూడా నిలబడే ప్రయత్నం చేయలేదు. ప్రత్యేక హోదా పోరు అన్నారు. దానిని వదిలేశారు.
ఇలా తప్పుమీద తప్పు చేస్తూ.. తప్పటడుగుల దశలోనే పార్టీని పుట్టి ముంచారు. దీంతో నిజంగానే రాపాక చెప్పినట్టు వచ్చే ఎన్నికల నాటికి పార్టీ ఉంటుందా? ఊడుతుందా? అనే సందేహం సర్వత్రా వినిపించింది. అదేసమయంలో రాపాక చేసిన మరో కీలక విమర్శ.. పవనే గెలవలేకపోవడం. ఇది నిజానికి చాలా తీవ్రమైన విషయం. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు రెండు చోట్ల నుంచి పోటీ చేసినా తిరుపతి నుంచి విజయం సాధించారు. ఇక, పవన్ విషయంలో ఈ ప్రయోగం తారుమారై.. ఆయన రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు. మరి ఆయనే విజయం సాధించనప్పుడు పార్టీ ఎలా ఉంటుందనేది రాపాక కీలక ప్రశ్న. మరి వీటికి పవన్ సమాధానం చెబుతారో లేదో చూడాలి.