జగన్ పై శివాజీ తరహాలో గెరిల్లాలా పోరాటం చేస్తున్నాను – RRR

-

మాజీ మంత్రి వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న కడప ఎంపీ వై.యస్. అవినాష్ రెడ్డి గారి ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని, ప్రజలకు న్యాయస్థానాలపై గౌరవం, విశ్వాసం ఇనుమడింపజేసే విధంగా ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. న్యాయస్థానాలంటే ఒక రకమైన భయం, నిర్వేదం, వాదనలు విన్న తర్వాత కూడా తీర్పు ఎప్పుడు వస్తుందోనని కొట్టుమిట్టాడుతున్న తెలుగు ప్రజలకు ఆశాజ్యోతి ఈ తీర్పు అన్నారు.


తాజాగా, రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణ రాజు గారు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… తనపై, తన కుటుంబంపై సాక్షి దినపత్రిక వేస్తున్న నిందలను ఎదుర్కొని పోరాటం చేస్తున్న సునీత గారికి ఆమెకు సహకరిస్తున్న భర్త రాజశేఖర్ రెడ్డి గారికి అభినందనలు తెలిపారు. ఇది అంతిమ విజయం కాదు అని, అయినా సునీత గారు పోరాటం చేస్తున్నది హింస ప్రవృత్తి కలిగిన దుష్టులతో అని, నిజమైన పులివెందుల పులిబిడ్డ అంటే సునీత గారే నని అన్నారు. న్యాయాన్ని, ప్రజాస్వామ్యాన్ని కోరుకునేవారు పోరాడే వ్యక్తులను అభిమానిస్తారని, తనని తీసుకువెళ్లి లాకప్ లో చిత్రహింసలకు గురి చేసినప్పటికీ, తాను శివాజీ తరహాలో గెరిల్లా పోరాటం చేస్తుంటే, సునీత గారు ప్రత్యక్ష పోరాటం చేస్తున్నారని అన్నారు. తన పోరాటం కంటే, సునీత గారి పోరాటం గొప్పదని, తాము చేయలేనిది చేస్తున్న వారిని ప్రజలు అభిమానిస్తారని అన్నారు.

తమలో బాధ ఉండి బయట పెట్టుకోలేని ఎందరికో ఈ తీర్పు ఉపశమనమని, ఈ తీర్పు ద్వారానైనా మారకపోతే రానున్న ఎన్నికల్లో ప్రజలే మార్చివేస్తారని రఘురామకృష్ణ రాజు గారు హెచ్చరించారు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విచారణకు సుప్రీం కోర్ట్ మరొక రెండు నెలల గడువునిచ్చిందని, ఈ కేసులో అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే రెండు నెలల వరకు ఆయనకు బెయిల్ లభించదని, అందుకే విచారణ గడువు పొడిగించడాన్ని అవినాష్ రెడ్డి గారి తరుపు న్యాయవాది రంజిత్ కుమార్ గారు వ్యతిరేకించారని తెలిపారు. అవినాష్ రెడ్డి గారి అరెస్టు తద్యమని, ఇంత చేశాక అవినాష్ రెడ్డి గారిని సీబీఐ అధికారులు అరెస్టు చేయకపోతే అనుమానాలు తలెత్తే అవకాశం ఉందని అన్నారు. ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారా?, పైకి వెళ్తుందా?, ఇంకా ఎంత వరకు వెళ్తుందన్నది తెలియదని అన్నారు. ఈ కేసులో ప్రజాసేవలో తరించిపోతున్న వారిని విచారణకు పిలిస్తే… సమయం దొరకాలని, వారు సీబీఐకి సమయాన్ని కేటాయించాలని అన్నారు. నాలుగు సంవత్సరాలుగా కోర్టుకు హాజరు కాకపోయినా సీబీఐ వారు చిత్తం దొర అన్నట్టుగా, ఈ టీం కూడా మా వైపు పర్వాలేదని అంటారా? అన్నది చూడాలని, కేసు విచారణకు రెండు నెలల వ్యవధి సబబేనని రఘురామకృష్ణ రాజు గారు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news