దేశంలో ఎవరూ చేయని సంక్షేమ యజ్ఞం వైఎస్ జగన్ చేశారు. కానీ 2024 ఎన్నికలు రకరకాల అనుభవాలను మిగిల్చింది అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ అనేది అందరికీ అందుబాటులో ఉండే పార్టీ. పార్టీలోని నలుగురు కూర్చుని తీర్మానం చేసుకుని దాన్ని అమలు చేసే పార్టీ మనది కాదు. అభిమానులతో నడిచే పార్టీ ఇది. అందరి అభిప్రాయాలను తీసుకుని నడిచే పార్టీ. అందరిలోనూ తిరిగి పార్టీని అధికారంలోకి తేవాలన్న కసి ఉంది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినా ఓడిపోవటానికి కారణమేంటనే చర్చ పార్టీలో ఉంది.
వైఎస్సార్సీపీని లేకుండా చేయాలని చంద్రబాబు కుట్రలు పన్నారు. ప్రతిపక్షం లేకుండా చేయాలని ఆయన అనుకుంటున్నారు. ఐదారు నెలలుగా అందుకు ఆయన ఏం చేస్తున్నారో చూస్తున్నాం. అందరూ గట్టిగా నిలబడాల్సిన సమయం వచ్చింది. 2019 తర్వాత చంద్రబాబు రెండు మూడేళ్లపాటు అసలు కనపడలేదు. తర్వాత కూడా రకరకాల రాజకీయాలు చేస్తూ వచ్చారు. మనం ఎప్పుడూ జనంలోనే ఉన్నాం. ఇప్పుడు మళ్లీ శక్తి పుంజుకోవాల్సిన అవసరం వచ్చింది. మన సంక్షేమ పథకాల వలన ప్రజల్లో కూడా చెక్కుచెదరని అభిమానం ఉంది. ప్రజల కోసం మళ్లీ మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వంలో మళ్లీ జన్మభూమి కమిటీలు వచ్చాయి. ఎంత సంపాదించుకోవాలో అంత సంపాదించుకోవటానికి దోపిడీలు చేసేస్తున్నారు. 2014-19 మధ్యలో ఉన్నట్లు కొంతైనా మొహమాటం కూడా లేకుండా దోపిడీ చేస్తున్నారు. ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులు పెడుతున్నారు అని సజ్జల పేర్కొన్నారు.