ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. శుక్రవారం విజయవాడ కాంగ్రెస్ కార్యాలయంలో షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వేషం, భాష మారిపోయాయని ఎద్దేవా చేశారు షర్మిల. ఉపముఖ్యమంత్రి అన్ని వర్గాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ అన్ని మతాలను సమానంగా చూడాలని కోరారు. కానీ ఆయన ఒకే మతానికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోడీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చేస్తున్నారని విమర్శించారు. జనసేన సెక్యులర్ పార్టీ అనుకున్నాం కానీ.. పవన్ కళ్యాణ్ కూడా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంతో వెళుతున్నారా..? అని నిలదీశారు. మణిపూర్ లో క్రైస్తవులపై ఊచకోత కోస్తే పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు షర్మిల. ఇతర మతాల వాళ్లు కూడా ఓట్లు వేస్తేనే పవన్ కళ్యాణ్ గెలిచారు అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.