ఇన్నాళ్లలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఎల్లో మీడియాపై బీజేపీ రాష్ట్ర సారథి సోము వీర్రాజు ఓ రేంజ్‌లో విరుచుకుపడడం రాజకీయంగా సంచలనంగా మారింది. సాధారణంగా ఎల్లో మీడియా అంటే.. బీజేపీ నేతలు సైతం ఎన్నివిమర్శలు చేసినా.. మౌనం పాటిస్తారు. మరి దీనివెనుక ఏముందో తెలియదు కానీ.. ఎల్లో మీడియా విమర్శించినా కూడా ఏమీ ఎదురు దాడి చేయరు. గత ఏడాది ఎన్నికల సమయంలో నిజానికి ఎల్లో మీడియా బీజేపీకి చేసింది వ్యతిరేక ప్రచారమే. ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని, జగన్‌తో పొత్తు పెట్టుకున్నారని.. బీజేపీకి బుద్ధిచెప్పాలని ఇలా ఎల్లో మీడియా తీవ్ర వ్యతిరేక వార్తలతో విరుచుకుపడింది.
అయితే, అనూహ్యంగా ఎవరూ మాత్రం ఎల్లో మీడియాను ఒక్కమాటంటే ఒక్కమాట కూడా అనేవారు కాదు. గత బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అయితే.. ఏకంగా ఎల్లో మీడియాకు లీకులు కూడా ఇచ్చారనే వార్తలు వచ్చాయి. ఇలా ఎల్లో మీడియా వలలో చిక్కుకున్న బీజేపీ నాయకులు చాలా మంది ఉన్నారు. అయితే, వీరందరికీ విరుద్ధంగా ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడు సోము మాత్రం ఎల్లో మీడియాను చీల్చి చెండారనే చెప్పాలి. ఆది నుంచి ఎల్లో మీడియాకు దూరంగా ఉండే సోము.. తాజాగా తన కడుపులో ఉన్న బాధనంతా కక్కేశారు. ఇటీవల ఓ పత్రిక అధినేత.. బీజేపీకి సుద్దులు చెప్పారు.
జీవీఎల్ ను బీజేపీ అదుపులో ఉంచుకోవాలని, లేకపోతే.. బీజేపీ ఏపీలో ఎదిగే పరిస్థితి లేదని నీతులు వల్లించారు. దీనిపై తీవ్రస్థాయిలో ఫైరైన సోము.. ఆ విశ్లేషణ వెనుక కొత్తగా బీజేపీ పైన పుట్టిన ప్రేమ కాదని, ఇది పతనానికి చేరువలో ఉన్న చంద్రబాబుని, టీడీపీని రక్షించే ప్రయత్నమని ఇట్టే పిల్లలకు కూడా అర్థమైపోతుంది. మీరు టీడీపీకి సలహాదారునిగా, అనుకూలంగా పని చేస్తారని ప్రజల్లో వినికిడి. మరీ ఇంత పబ్లిక్‌గా, నిర్లజ్జగా పత్రికను అడ్డం పెట్టుకుని మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం తగునా చెప్పండి.
మీ రాజకీయ సలహాలు చంద్రబాబు గారికి మాత్రమే ఇవ్వండి. అసెంబ్లీలో టీడీపీ 23 స్థానాలకే పరిమితం అవiaడంలో మీ పాత్ర కూడా ప్రధానమా కాదా?- అని సోము కడిగి పారేశారు. ఈ పరిణామం.. బీజేపీలోనే కాకుండా పలు పార్టీల్లోనూ చర్చలకు దారితీసింది. ఏదేమైనా.. ఎల్లో మీడియా తన హద్దులు తను ఏర్పాటు చేసుకోవాలనే సూచనలు వస్తుండడం గమనార్హం.