బిజెపిలో బాబు బ్యాచ్ కు చెక్ ? సీల్డ్ కవర్ లో సోము ‘ రాజకీయం’

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి సోము వీర్రాజు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకున్నట్టుగా కనిపిస్తున్నారు. ఆ పార్టీని రాజకీయంగా దెబ్బ తీయడంతో పాటు, భవిష్యత్తులో కోలుకోని విధంగా దెబ్బతీసి, టిడిపి స్థానాన్ని బీజేపీ ఆక్రమించేలా చేసేందుకు ఆయన గట్టిగానే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. మొదట్లో బహిరంగంగానే టిడిపి వ్యవహారాలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ, హడావుడి చేసే వారు. మధ్యలో కాస్త ఆ ఊపు తగ్గినట్టు కనిపించినా, పూర్తిగా ఆ పార్టీ మీద , ఆ పార్టీలోని నాయకుల వ్యవహారాల మీద దృష్టి పెట్టారు. అంతేకాకుండా బిజెపిలో ఉంటూ, టీడీపీకి అన్ని రకాలుగా సహకరిస్తూ,  ఎప్పటికప్పుడు పార్టీలోని పరిణామాలను బాబుకు చేరవేస్తూ వస్తున్న కొంతమంది నాయకుల పైన సోము వీర్రాజు దృష్టిసారించారు. వారిని ఒక కంట కనిపెడుతూనే , టిడిపికి వారు సహకరిస్తున్న వ్యవహారాల పై ఎప్పటికప్పుడు అధిష్టానం పెద్దలకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా బిజెపి లో ఉన్న బాబుకు అత్యంత సన్నిహితమైన సుజనా చౌదరి వ్యవహారాలపై వీర్రాజు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టిడిపి నుంచి బిజెపిలో చేరిన నాయకులకు , సోము వీర్రాజు కు అసలు పొసగడం లేదని, ఒకరిని దెబ్బతీసేందుకు మరొకరు ప్రయత్నిస్తున్నట్టు బిజెపిలో వ్యవహారం కనిపిస్తోంది. బీజేపీలోని బాబు బ్యాచ్ గా పేరొందిన వారికి చెక్ పెట్టడం, లేక వారిని పార్టీ నుంచి సాగనంపే విషయాలపైన వీర్రాజు దృష్టిసారించారు. అయితే సుజన వర్గం సైతం వీర్రాజు కు చెక్ పెట్టే విధంగా ఆయనకు సహాయ నిరాకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సోము వీర్రాజు బిజెపిలోని బాబు బ్యాచ్ గా పేరుపొందిన కొంతమంది నాయకుల పై వివిధ కారణాలు చూపిస్తూ సస్పెన్షన్ వేటు సైతం వేశారు.
ముందు ముందు ఎవరైనా ఇటువంటి వ్యవహారాలు చేసినా, వారికి ఇదే పరిస్థితి తప్పదు అన్నట్లుగా ఆయన సంకేతాలు ఇచ్చారు. ఇదిలా ఉంటే, సుజనా చౌదరి బ్యాచ్ కు చెందిన కొంతమంది నాయకుల వ్యవహారశైలిపై ఎప్పటికప్పుడు అధిష్టానం పెద్దలకు సీల్డ్ కవర్ లో వీర్రాజు ఫిర్యాదులు పంపుతున్నారు అని, సరైన సమయం చూసి వారిపైనా వేటు పడడం ఖాయం అంటూ బిజెపిలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
-Surya