శుక్రవారం అనకాపల్లిలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీశాఖ అధికారులకు సవాల్ విసిరారు. గత ఐదు నెలల్లో ఏకంగా 60 లక్షల మొక్కలు నాటామని చెబుతున్న అటవీశాఖ సిబ్బంది.. ఐదు నెలల్లో ఇంత భారీ మొత్తంలో మొక్కలు నాటారని నిరూపిస్తే రాజీనామా చేస్తానని అన్నారు.
సోషల్ ఆడిట్ లో 60 లక్షల మొక్కలు నాటినట్లు నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు అయ్యన్నపాత్రుడు. రైతులు పొలంలో పెంచుకుంటున్న టేకు, వేప చెట్లు కొట్టాలంటే అనుమతులు కావాలి అని అడుగుతున్న అటవీశాఖ అధికారులు.. వైసిపి హయాంలో జగన్ పర్యటన సమయంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలు, చెట్లను ఏ అనుమతితో నరికివేసారో చెప్పాలని డిమాండ్ చేశారు.
నర్సీపట్నం డివిజన్ లో ఉన్న సామిల్ లో కలప స్మగ్లింగ్ జరుగుతోందని.. దీనికి కొంత మంది అటవీశాఖ అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. కలప స్మగ్లింగ్ కి సంబంధించిన పూర్తి వివరాలను, ఈ అక్రమాలకు సహకరించిన అధికారుల వివరాలను సేకరించి జిల్లా కలెక్టర్, జిల్లా అటవీ శాఖ అధికారులకు అందజేశారు.