వెళ్లేదారిలో విశాఖ ఉంటుంది… కాస్త చూడు లోకేష్!

-

రాజకీయ నాయకులకు రాజకీయాలే ముఖ్యం.. కాదనలేము! రాజకీయ పార్టీలకు ఆ పార్టీ నేతలే ముఖ్యం.. కాదనలేము! కానీ… అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలు ముఖ్యం.. కాదనలేము! కానీ… “కాదు” అంటున్నారు నారా లోకేష్! టీడీపీ ఆశాజ్యోతి, భవిష్యత్ ఆశాకిరణం అయిన నారా లోకేష్.. యువకుడు, ఉత్సాహవంతుడు. ఈ సమయంలో అత్యంత ఉత్సాహంగా నాయకులను పార్టీలో నిలబెట్టుకోవడమే కాకుండా.. ప్రజల్లోనూ పార్టీని నిలబెట్టుకోవాలి.. వారు కష్టాల్లో ఉంటే కరోనా అని కూడా చూడకుండా పరామర్శించాలి.. ధైర్యం చెప్పాలి! కానీ… తమ పార్టీ నాయకులపై చూపిస్తున్న శ్రద్ధలో సగంలో సగం అయినా ప్రజలపై చూపించలేదు అనేది ఇక్కడ లోకేష్ పై వస్తున్న విమర్శ!

కరోనా వచ్చి రాష్ట్ర ప్రజలంతా ఇబ్బందులు పడ్డారు.. లోకేష్ రాలేదు! విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ లో ప్రజలు పిట్టల్లా రాలిపోయారు.. లోకేష్ రాలేదు! కానీ… అక్రమాల కేసులో అనంతపురంలో తమ పార్టీ నాయకులు అరెస్టు అయితే వెళ్లారు.. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వచ్చారు. అవినీతి కేసులో అరెస్టయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కుటుంబాన్ని పరామర్శించడానికి శుక్రవారం నిమ్మాడకు వెళ్తున్నారు లోకేష్! ఈ సమయంలోనే లోకేష్ కు విలువైన సూచనలు చేస్తున్నారు ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు!

అమరావతి నుంచి శ్రీకాకుళం వెళ్లే మార్గ మధ్యలోనే విశాఖ ఉంటుంది.. ఆ విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాలు ఉన్నాయి.. అక్కడకు కూడా వెళ్లి ఆ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి, ఓదార్చి రావాలని సూచిస్తున్నారు! ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. పార్టీ తరుపున పెద్ద పొరపాటే జరిగింది. అయినా పర్లేదు.. పరామర్శించి రావాలని సూచిస్తున్నారు శ్రేయోభిలాషులు!

మరి ఈ విషయాలను, ఈ సూచనలను లోకేష్ పరిగణలోకి తీసుకుంటారా? తమకు తమ పార్టీ నాయకులు ఎంత ముఖ్యమో, ప్రజలు కూడా అంతే ముఖ్యమని చేతల్లో చూపిస్తారా? లేక.. ఎన్నికలు ఇప్పట్లో ఏమీ లేవు కాబట్టి… అమరవాతి టు శ్రీకాకుళం నాన్ స్టాప్ గా వెళ్లొచ్చేస్తారా అనేది వేచి చూడాలి!

Read more RELATED
Recommended to you

Latest news