టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు కుటుంబంలో తీవ్ర విషాదం

హైదరాబాద్: టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన రెండో కుమారుడు రవీంద్ర బంజారాహిల్స్ లోని ఓ హోటల్‌లో మృతి చెందారు. ఆయన లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ మేరకు రవీంద్ర.. హైదరాబాద్‌లో హోటల్ ఉంటూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం తర్వాత హోటల్ ఖాళీ చేయాల్సి ఉండగా.. సాయంత్రం వరకూ ఆయన బయటకు రాలేదు. దీంతో హోటల్ సిబ్బంది మరో తాళంతో తలుపులు తీశారు. రవీంద్ర కనిపించలేదు. హోటల్ బాత్ రూమ్‌లో పడి ఉన్నారు. అప్పటికే ఆయన చనిపోయి ఉన్నట్లు హోటల్ సిబ్బంది చెబుతున్నారు.

రవీంద్ర నోట్లో నుంచి రక్తం బయటకు వచ్చి ఉండటంతో పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. రవీంద్ర శరీరంపై ఎలాంటి గాయాలు లేవని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం రవీంద్ర మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఇటీవల కాలంలో మాగంటి బాబు పెద్ద కుమారుడు రాంజీ కూడా మృతి చెందారు. పెద్ద కుమారుడి మరణాన్ని మరవకముందే మరో కుమారుడు చనిపోవడంతో మాగంటి బాబు కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. మాగంటి బాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.