కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్శిటీ క్యాంపస్ లు వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటయ్యాయని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థను నెలకొల్పాలని కోరారు. కాస్మోపాలిటన్ స్వభావంతో పాటు అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాలతో భారతదేశంలోని ప్రధాన నగరాలలో ఒకటైన విశాఖపట్నంలో కానీ, అమరావతిని ప్రజా రాజధానిగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, పుష్కలమైన భూ లభ్యతతో పాటు, మరో ప్రధాన నగరమైన విజయవాడకు దగ్గరగా ఉన్న అమరావతిలో కానీ, ఎన్ఎఫ్ఎస్ యు క్యాంపస్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న బేడా జంగం సామాజిక వర్గానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం అభ్యర్తించారు. ఏపీ రాష్ట్ర సాంస్కృతిక, సామాజిక నిర్మాణంలో ప్రత్యేకమైన, సమగ్రమైన పాత్ర పోషిస్తున్న బేడా.. సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి అవకాశాలు, సామాజిక, ఆర్థిక అవసరాలను తీర్చడానికి సమగ్ర విధానాన్ని రూపొందించాలని, రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కేటగిరీలో సరైన గుర్తింపు కోసం వారి డిమాండ్ లను ప్రాధాన్య ప్రాతిపదికన పరిశీలించాలని కోరారు.