ముసుగు ధరించిన ముగ్గురు వ్యక్తులు తనను తీవ్రంగా కొట్టారని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. ‘నా ముఖానికి టవల్ చుట్టేసి అర గంటపాటు తీవ్రంగా కొట్టారు. అరచేతిపైనా, అరికాళ్లపైనా వాచిపోయేలా కొట్టారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురిచేశారు’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై వైసీపీ నాయకులు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అనుచరులు విధ్వంసానికి పాల్పడిన ఘటనలపై నిరసన తెలిపేందుకు సోమవారం సాయంత్రం పట్టాభి గన్నవరం వెళ్లగా… పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. హత్యాయత్నంతోపాటు ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద రెండు వేర్వేరు కేసులు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.
గన్నవరం సీఐ కనకారావును పట్టాభి సహా 11 మంది టీడీపీ నాయకులు హత్య చేసేందుకు ప్రయత్నించారని, ఆయన్ని కులం పేరుతో దూషించారని రిమాండు రిపోర్టులో పేర్కొని, వారికి జ్యుడిషియల్ రిమాండు విధించాలని న్యాయమూర్తిని కోరారు. అయితే పోలీసులు తనను కొట్టారంటూ పట్టాభి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న న్యాయమూర్తి శిరీష… ఆయనకు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి ఆ తర్వాత తన ఎదుట హాజరు పరచాలని పోలీసులను ఆదేశించారు.