తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రస్తుతం నాలుగు లక్షల ఉద్యోగాలు ఉన్నాయని, వచ్చే ఐదేళ్లలో ఎనిమిది లక్షలకు పెంచాలనేది లక్ష్యమని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో జీవశాస్త్ర రంగం విలువ, ఉద్యోగాలను 2028 నాటికి రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ సహా పరిసరాల్లోని లైఫ్ సైన్సెస్ రంగ కంపెనీల నికర విలువను 2028 నాటికి వంద బిలియన్ డాలర్లకు చేర్చేలా ప్రణాళికలు రూపొందించామన్నారు.
ఈ నెల 24 నుంచి 26 వరకూ హైదరాబాద్‌లో ‘అడ్వాన్సింగ్ ఫర్ వన్: షేపింగ్ నెక్ట్స్ జనరేషన్ హ్యూమనైజ్డ్ హెల్త్‌కేర్’ అనే నినాదంతో జరగనున్న 20వ బయో ఆసియా సదస్సులో తొలిసారిగా ‘యాపిల్’ సంస్థ పాల్గొంటోందని తెలిపారు. గతేడాది సదస్సుకు భాగస్వామ్య దేశంగా స్విట్జర్లాండ్ ఉండగా, ఈ ఏడాది యూకే వ్యవహరిస్తోందన్నారు.
‘‘జీవశాస్త్ర రంగంలో ప్రపంచానికి తెలంగాణ హబ్‌గా మారింది. ఏడాదికి 900 కోట్ల టీకా డోసులను ఇక్కణ్నుంచి ఉత్పత్తి చేస్తున్నాం. ప్రపంచం మొత్తమ్మీద ఉత్పత్తి అయ్యే టీకాలలో ఇది 35 శాతం. వచ్చే ఏడాదికి 1,400 కోట్ల డోసుల ఉత్పత్తి సామర్థ్యానికి(50%) చేరుకోబోతున్నాం. ప్రస్తుతం ఇక్కడ ఉత్పత్తి అయ్యే టీకాలు 150కి పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. హైదరాబాద్ ఫార్మాసిటీలో 14 వేల ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మా క్లస్టర్‌గా ఇది రూపుదాల్చనుంది.” అని కేటీఆర్ అన్నారు.