గంటా కాళ్ళ కిందకు నీళ్ళు… టీడీపీ నేతల సెటైర్లు!

-

ఏమి మాట్లాడితే ఏమోస్తాదనుకున్నారో లేక వ్యూహాత్మక మౌనంలో భాగంగా ఉన్నారో తెలియదు కానీ… రాష్ట్రంలో జరిగే, ఆఖరికి పార్టీలో జరిగే విషయాలపై కూడా స్పందించడం మానేశారు టీడీపీ నేత గంటా శ్రీనివాస్! పార్టీపై విమర్శలు వచ్చినా స్పందించలేదు, అధినేతపై విమర్శలు వచ్చినా స్పందించలేదు. ఆఖరికి తమ పార్టీ నాయకులను, గత మంత్రివర్గంలో తమ బ్యాచ్ మెట్ ను అరెస్టు చేసినా కూడా స్పందించలేదు… కానీ తాజాగా ఆ మౌనం మాట్లాడింది!

ఆ మౌనాన్ని మాట్లాడించింది.. అధినేతపై విమర్శో, తమ పార్టీనేత అరెస్టో కాదు సుమా.. తన ముఖ్య అనుచరుడి అరెస్టు!! అవును… గంటా శ్రీనివాస్ ఎట్టకేలకు పెదవి విప్పాల్సివచ్చింది. ఆయన అతి ముఖ్య అనుచరుడు నలందా కిషోర్ మీద సీఇడీ గురి పెట్టింది. సోషల్ మీడియాలో ఎంపీ విజయసాయిరెడ్డి మీద, మంత్రి అవంతి శ్రీనివాస్ మీద అసభ్య పోస్టింగులు పెడుతున్నారన్న కారణంగా ఆయన్ని సీఐడి అదుపులోకి తీసుకుందట. దీంతో గంటా మౌనానికి మాటొచ్చింది.. పంచ్ డైలాగులు పేల్చే పరిస్థితి వచ్చింది!

నలందా కిషోర్ ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారన్న విషయం తెలుసుకున్న గంటా శ్రీనివాసరావు విశాఖపట్నంలోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. సిఐడి అధికారుల అదుపులో ఉన్న తన సన్నిహితుడిని కలిసేందుకు అనుమతించాలని కోరారు. అయితే విచారణ జరుగుతున్నందున అనుమతించలేదని అధికారులు చెప్పారు. దీంతో ఫైరయిన గంటా… నలందా కిషోర్ ఏ తప్పూ చేయలేదు! ఆయన ఏమైనా దేశ ద్రోహానికి పాల్పడ్డారా? రక్షణ వ్యవహారాలను లీక్ చేశారా? దొంగతనాలు ఏమైనా చేశారా? అని ప్రశ్నించిన అనంతరం.. నా మీద కక్ష ఉంటే కేసులు పెట్టండి.. నేను రెడీ అంటూ సవాల్ కూడా చేశారు.

దీంతో… అధినేతకు, పార్టీకి, పార్టీ నేతలకు ఇన్నాళ్ళు ఎన్ని ఇబ్బందులు వచ్చినా నోరుమెదపకుండా, అధికార పార్టీని ఒక్క మాట అనకుండా ఉన్న గంటాకు… తన కాళ్ళ కిందకు నీళ్ళు రాగానే మాటల ప్రవాహాలు వస్తున్నాయని, సవాళ్లు కూడా చేస్తున్నారని అంటున్నారు టీడీపీ నేతలు. తనవరకూ వచ్చేసరికి తెలిసినట్లుంది నొప్పి అని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. కాగా… ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు ఎవరూ ఇంతవరకూ స్పందించిన దాఖలాలు ఇంకా లేవు!! మరి ఈ విషయంలో గంటాకు పార్టీ సపోర్ట్ ఉంటుందా.. లేక వారు కూడా వ్యూహాత్మక మౌనాన్నే పాటిస్తారా అనేది వేచి చూడాలి!

Read more RELATED
Recommended to you

Latest news