ఏపీలోని రాజమహేంద్రవరం మరో కీలక ఘట్టానికి సన్నద్ధమైంది. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు శత జయంతి ఉత్సవాలు చరిత్రలో నిలిచిపోయేలా ఈ నెల 27, 28 తేదీల్లో ఇక్కడి వేమగిరిలో మహానాడు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ దఫా ప్లీనరీ, బహిరంగ సభలకు వేర్వేరు చోట్ల వేదికలు ఏర్పాటు చేశారు.
27వ తేదీన సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ప్రతినిధుల సభ, 28న 60 ఎకరాల్లో మహానాడు బహిరంగ సభ నిర్వహిస్తారు. పార్కింగ్, భోజన స్టాళ్లకు మరో 140 ఎకరాల మేర కేటాయించారు. ఈ తరుణంలో రాజమహేంద్రవరంతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో పసుపు జెండాలు రెపరెపలాడుతున్నాయి. ముఖ్య నాయకులతో సమావేశం, వీఐపీ లాంజ్‌తోపాటు, ప్రతినిధులు భోజనం చేసేందుకు సుమారు 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ షెడ్ నిర్మించారు.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా 28న ఉదయం 10 గంటలకు చంద్రబాబుతో పాటు పార్టీ ముఖ్య నాయకులు రాజమహేంద్రవరంలోని కోటిపల్లి బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. ఆ రోజు మహానాడు బహిరంగ సభకు 15 లక్షల మంది వచ్చే అవకాశమున్నందున 20 లక్షలకు పైగా నీటి సీసాలు, మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు.