ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగం తొలగాలంటే వైసీపీ అధికారం పోవాలని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. నిరుద్యోగ సమస్యపై నిరసనకు దిగారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో వెంకటపాలెం గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు.
అనంతరం తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద నిరుద్యోగ సమస్యపై నిరసన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన 2.30లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ఎక్కడ?అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. జాబ్ రావాలంటే జగన్ పోవాలంటూ నినాదాలు చేశారు.
ప్రతిపక్షంలో ఉండగా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న జగన్.. అధికారంలోకి వచ్చాక ఆ హామీ నెరవేర్చలేదన్నారు. ఉద్యోగాల భర్తీ చేపట్టలేదని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. టీడీపీ హయాంలో డీఎస్సీలు వేశామని, నిరుద్యోగ భృతి ఇచ్చామని గుర్తు చేశారు. జాబ్ ఎక్కడ? జగన్ ఎక్కడ? అని అసెంబ్లీలో ప్రశ్నిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.