ఏపీలోని వైద్యులకు చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది. ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వ వైద్యులు, ఇతర సిబ్బంది నిర్ణీత పనివేళలు పాటించకపోవడంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంపై గురువారం సాయంత్రం మూడు గంటలకు పైగా మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులతో లోతుగా సమీక్షించారు. పనివేళల పట్ల నెలకొన్న క్రమశిక్షణా రాహిత్యం, దానిని అరికట్టేందుకు ప్రస్తుతం వివిధ స్థాయిల్లో చేపడుతున్న చర్యలు, పరిస్థితిని మెరుగుపర్చేందుకు మున్ముందు చేపట్టాల్సిన చర్యల గురించి వివరంగా చర్చించారు.
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం.టి.కృష్ణబాబు, వివిధ శాఖాధిపతులు సమీక్షలో పాల్గొన్నారు. ఎక్కువ మంది క్రమశిక్షణ పాటిస్తున్నా కొంత మంది సిబ్బంది పనివేళలను ఉల్లంఘిస్తుండడంతో ప్రజారోగ్య వ్యవస్థకు చెడ్డ పేరు వస్తోందని మంత్రి అన్నారు. వైద్యులు, ఇతర సిబ్బంది ఆలస్యంగా విధులకు రావడం, నిర్ణీత సమయానికంటే ముందే నిష్క్రమించడంపై ప్రసార మాధ్యమాల్లో తరచుగా వస్తున్న వార్తలు తనను ఆవేదనకు గురిచేస్తున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు.
వివిధ సమస్యలతో ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగులకు వైద్యులు అందుబాటులో లేకపోతే వారెంతో ఇబ్బందులకు గురవుతారని, కనుక అందరూ పనివేళలను పాటించేలా తగు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి అత్యున్నత ప్రభుత్వ సర్వ జన ఆసుపత్రులు వరకు వైద్యులు, సహాయక సిబ్బంది హాజరుపై పర్యవేక్షణ జరుగుతున్న తీరును చర్చించి ప్రస్తుత వ్యవస్థలో లోపాల్ని గమనించారు.