వంగ‌వీటి రాజ‌కీయాలు ముగిసిన‌ట్టే…. నిన్న నాలుగు కార్లొస్తే.. నేడు ఆటోలు లేవా…!

-

విజ‌య‌వాడలో కీల‌క‌మైన రాజ‌కీయ కుటుంబం వంగ‌వీటి రంగా ఫ్యామిలీ. ఆయ‌న కాంగ్రెస్‌లో ఉండ‌గా విజ‌య‌వాడ‌ను ఏలారు. అయితే, ఆయ‌న కుమారుడిగా రంగ ప్ర‌వేశం చేసిన రాధా మాత్రం తండ్రి చ‌రిష్మాను అందిపుచ్చుకోవ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హ‌రించాలి? ఏ ఎండ‌కు ఏ గొడుగు ప‌ట్టాలి?  ఎలాంటి వ్యూహానికి ఎలాంటి ప్ర‌తి వ్యూహం ప‌న్నాలి. అనే విష‌యాల‌పై పూర్తిగా రాధాకృష్ణ ఫెయిల‌య్యార‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టికి మూడు పార్టీలు మారినా.. ఆయ‌న‌లో రాజ‌కీయంగా ఓ నిబ‌ద్ధ‌త క‌నిపించ‌డం లేద‌నేవారే ఎక్కువ‌గా ఉన్నారు.

కాంగ్రెస్‌, త‌ర్వాత ప్ర‌జారాజ్యం, త‌ర్వాత వైఎస్సార్ సీపీల‌ను మారి ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్నారు. గ‌తేడాది ఎన్నిక‌ల‌కు ముందు క్ష‌ణికావేశంలో ఆయ‌న వైఎస్సార్ సీపీని వ‌దులుకున్నారు. లేక‌పోయి ఉంటే.. ఇప్పుడు ఏ ఎంపీగానో.. లేదా ఎమ్మెల్యేగానో ఉండేవార‌ని అంటున్నారు ఆయ‌న అనుచ‌రులు. పోనీ.. టీడీపీలోకి వెళ్లి ఆయ‌న సాధించింది ఏదైనా ఉందా ?  విజ‌య‌వాడ సెంట్ర‌ల్ సీటు కోసం ర‌గ‌డ చేసి.. టీడీపీలోకి వెళ్లినా.. అక్క‌డా ఆ టికెట్‌ను ద‌క్కించుకోలేదు. పైగా త‌న నియోజ‌క‌వ‌ర్గంలో వేలు పెట్ట‌డానికి కూడా త‌న అనుమ‌తి కావాల‌ని ఇక్క‌డి టీడీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా గ‌ట్టిగానే స్ప‌ష్టం చేశారు.

ఇక‌, తూర్పులో క‌మ్మ సామ్రాజ్యం రాధాను ఎప్పుడో ప‌క్క‌న పెట్టింది. ఎంపీ కేశినేనితోనూ అంటీముట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పోనీ..న‌గ‌ర అధ్య‌క్షుడు ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న‌తో అయినారాధా ట‌చ్‌లో ఉన్నారా? అంటే అది కూడా లేదు. త‌న కేడ‌ర్‌ను కూడా నిలుపుకోలేక పోతున్నారు. గ‌తంలో రాధా వెళ్తే.. ఆయ‌న వెంట క‌నీసం నాలుగైదు కార్లు వ‌చ్చేవి. కానీ ఇప్పుడు ఆటోలు కూడా రావ‌డం లేదు. మ‌రి ఈ ప‌రిస్థితి నుంచి రాధా బ‌య‌ట‌ప‌డేదెప్పుడు? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పేవారు క‌రువ‌య్యారు. మొత్తానికి రాధా భ‌విష్య‌త్తు రాజ‌కీయం ఎటు దారి తీస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news