ఎవరు పార్టీని వీడినా ఇబ్బంది లేదు – మంత్రి కాకాని

-

ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తప్పు చేయడం వల్లే పార్టీ వారిని సస్పెండ్ చేసిందన్నారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. జిల్లాలో ఆ ఎమ్మెల్యేలు అందరూ జగన్ వల్లే గెలిచారని అన్నారు. జగన్ చెప్పిన వారికి ఓటు వేయకుండా ద్రోహం చేశారని.. ఇది క్షమించరాని నేరం అన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రితో చర్చించాలి తప్ప విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు.

ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారని సజ్జల ప్రకటన చేశారు తప్ప పేర్లు చెప్పలేదన్నారు. డబ్బులు తీసుకున్న వారే భుజాలు తడుముకుంటున్నారని అన్నారు. ప్రజలు ఆ ఎమ్మెల్యేలను చీదరించుకుంటున్నారని దుయ్యబట్టారు. పట్టభద్రుల ఎన్నికలు ఎదుర్కోవడం ఇది వైసీపీకి మొదటిసారి అని.. ఈ ఎన్నికల ప్రక్రియ కొంత క్లిష్టంగా ఉంటుంది.. ఇందులో కొంత వెనకపడ్డాం అన్నారు.

ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేయాలని..టిడిపి కూడా రెండో ప్రాధాన్యత ఓటుతో గెలిచిందన్నారు. ఎవరు ఓటు వేశారనేది అందరికే తెలుసని.. వారి వైఖరే ఈ విషయం స్పష్టం చేస్తోందన్నారు. కొందరు మరుసటి రోజు అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేశారని ఆరోపించారు. ఎవరు పార్టీని వీడినా ఇబ్బంది లేదని.. పార్టీ పటిష్టంగా ఉందన్నారు. కొత్త నేతలు చాలా మంది ఉన్నారని తెలిపారు మంత్రి కాకాని.

Read more RELATED
Recommended to you

Latest news