అవును! కర్నూలు జిల్లాలో ఇప్పుడు ఈ వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఒకింత ఫర్వాలేదు అనుకున్న కర్నూలు జిల్లాలో ఎంత కాంగ్రెస్ ఆధిపత్యం ఉన్నప్పటికీ.. కేఈ కృష్ణమూర్తి.. భూమానాగిరెడ్డి వంటివారు టీడీపీ మోసుకుంటూ వచ్చారు. అయితే, తర్వాత తర్వాత.. పరిస్థితిలో మార్పు వచ్చింది. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ ప్రారంభించిన తర్వాత.. ఇక్కడ టీడీపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. భూమా నాగిరెడ్డి వంటి బలమైన నాయకుడు జగన్ కు జై కొట్టారు. అదేవిధంగా కేఈ కృష్ణమూర్తి హవా కూడా తగ్గిపోయింది. దీంతో చంద్రబాబు తప్ప మరో దిక్కేలేదని ప్రచారం జరిగిన 2014లోనే ఆ పార్టీకి రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టినా.. ఇక్కడ మాత్రం కేవలం మూడు సీట్లు దక్కాయి.
మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీ స్థానాలుంటే.. 2014లోనే వీటిలో 11 అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీ సీట్లను కూడా గుండుగుత్తుగా వైసీపీ దక్కించుకుంది. అయితే, కేఈ కృష్ణమూర్తి వంటి దిగ్గజం విజయం సాధించడంతో హమ్మయ్య పార్టీ బతికే ఉందని చంద్రబాబు ఊపిరి పీల్చుకున్నారు.ఇక, గత ఏడాది ఎన్నికల విషయానికి వస్తే.. మొత్తంగా వైఎస్సార్ సీపీ తన ఖాతాలో వేసేసుకుంది. దీంతో టీడీపీకి జీరో. పోనీ.. ఇక్కడ పార్టీని బలోపేతం చేసుకునేందుకుఏదైనా ఛాన్స్ ఉందా? అది కూడా కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కురువృద్ధులు కోట్ల సూర్యప్రకాశ్ దంపతులను పార్టీలోకి ఆహ్వానించినా.. కేఈని సంతృప్తి పరిచేందుకు ఆయన ఫ్యామిలో వారసుడికి, సోదరుడికి టికెట్లు ఇచ్చినా . ఫలితం లేకుండా పోయింది.
2017లో కర్నూలులోని కీలకమైన నంద్యాల నియోజకవర్గంలో బలంగా ఉన్న శిల్పా కుటుంబానికి చంద్రబాబు హ్యాండివ్వడంతో వారు కూడా వైసీపీలో చేరారు. పోనీ.. పార్టీకి ఉపయోగకరంగా ఉంటారని భూమా కుటుంబాన్ని చేరదీస్తే.. భూమా కుమార్తె అఖిల ప్రియ ఒంటెత్తు రాజకీయాలతో తనను తాను ఒంటరిని చేయడంతోపాటు .. పార్టీని కూడా ఒంటరిని చేసేశారు. దీంతో ఇప్పుడు ఇక్కడ పార్టీ జెండా మోసే నాయకుడు లేకుండా పోయారు. జిల్లాలో రెండు ఎస్సీ నియోజకవర్గాల్లో పార్టీలో ఉండే కార్యకర్త కూడా కనిపించడం లేదు. ఇక టీడీపీ నుంచి ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ బయటకు వచ్చి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు భూమా కుటుంబంలో చీలిక వచ్చేసింది. ఎన్నికల్లో ఓడిన కోట్ల ఫ్యామిలీ రాజకీయాలకు దూరంగా ఉంటోంది.
మరోపక్క వైసీపీ దూకుడు మామూలుగా లేదు. వైసీపీని వదులకుని, చంద్రబాబును నమ్ముకున్న వారు కూడా గత ఎన్నికల్లో మట్టి కరిచారు. పోనీ.. వీరైనా పార్టీ కోసం ఏదైనా చేస్తున్నారా ? అంటే.. ఎప్పుడెప్పుడు గ్రీన్ సిగ్నల్ వస్తే.. అప్పుడప్పుడు వైఎస్సార్ సీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు. ఈ లిస్టులో పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత దంపతులు ముందు వరుసలో ఉన్నారు. ఇలా మొత్తంగా కర్నూలులో పచ్చజెండా మోసే వారు లేక చతికిలపడిందని రాజకీయ నేతల మధ్యచర్చ సాగుతుండడం గమనార్హం.