MANAp తనకు సంబంధం లేని విషయాలను ఆయన భుజాలపై వేసుకుంటున్నారు. కుటుంబంలో చిచ్చు పెడుతున్నారనే అపవాదును ఆయన ఎదుర్కొంటున్నారు. విషయం ఏంటంటే.. సింహాచలం దేవస్ధానంతో పాటు మాన్సాస్ ట్రస్ట్ బోర్డు చైర్ పర్సన్‌గా ఆనంద గజపతిరాజు వారసురాలిగా సంచయిత గజపతిరాజుకి నియామకం చేయడాన్ని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు జీర్ణించుకోలేకపోయారు.
చిన్న వయస్సులో తన అన్న కూతురుకి ఆ అవకాశం రావడంపై హర్షించాల్సిన అశోక్ గజపతిరాజు తనలోని అసలైన కోణాన్ని బయటపెడుతూ వ్యతిరేకించారు. ఆమెకు తమ కుటుంబంతో సంబంధం లేనట్టుగా.. తామొక్కరే పీవీజీ రాజు వారసులిగా ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయంలో మరో ముందడుగు వేసి న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. వాస్తవానికి సంచయిత గజపతిరాజు గత కొన్ని సంవత్సరాలుగా సన అనే స్వచ్చంద సంస్ధను స్ధాపించి విశాఖ, ఢిల్లీ తదితర ప్రాంతాలలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అప్పట్లో టీడీపీ మంత్రులు, ఎంపీలు సైతం ఈమె సేవా కార్యక్రమాలలో పాల్గొని అభినందించిన సంధర్బాలు కూడా ఉన్నాయి.
ఇక, ఇప్పుడు ఇది వివాదానికి దారితీసింది. అయితే, ఈ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా మెలిగిన చంద్రబాబు.. ఈ వివాదాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలకు తెరదీస్తున్నారనే వాదన ఉంది. సమస్యను సమసిపోయేలా తనదైన చాతుర్యంతో వ్యవహరించాల్సిన చంద్రబాబు కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు. తాజాగా కేరళకు చెందిన పద్మనాభ స్వామి ఆలయం విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును దీనికి ఆపాదిస్తూ.. చంద్రబాబు ట్వీట్ చేయడం మేధావులను సైతం విస్మయానికి గురి చేసింది.
ట్రావెన్ కోర్ మాదిరిగానే వారసులుకే మాన్సాస్ ట్రస్ట్ బాధ్యతలు అప్పగించాలంటూ చంద్రబాబు చేసిన ట్వీట్‌కు సంచయిత గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. పీవీజీ రాజు గారి అసలైన వారసులు తన తండ్రి ఆనంద గజపతిరాజు అయితే ఆయన అసలైన వారసురాలు తానేనని ఘాటుగా రీట్వీట్ చేశారు. ప్రభుత్వం మాన్సాస్ ట్రస్ట్ విషయంలో అసలైన వారసులనే నియమించిందంటూ చురకలు అంటించారు. ఇప్పటికైనా చంద్రబాబు మాన్సాస్ ట్రస్ట్ పై రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఈ పరిణామాలతో చంద్రబాబు ఇమేజ్ మరింత దిగజారిపోయిందనే కామెంట్లు వినిపిస్తుండడం గమనార్హం.